World Cup: స్ట్రాటో ఆవరణంలోకి వరల్డ్ కప్ ట్రోఫీని పంపించిన ఐసీసీ

  • ఈ ఏడాది అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు వరల్డ్ కప్
  • మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న భారత్
  • ఈవెంట్ కు ప్రచారం కల్పించేందుకు ట్రోఫీని స్ట్రాటోస్ఫియర్ లోకి పంపిన ఐసీసీ
  • మోదీ స్టేడియంలో ల్యాండైన బెలూన్
ICC sent world cup trophy into stratosphere

ఈ ఏడాది అక్టోబరులో భారత్ లో ఐసీసీ పురుషుల వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. వన్డే ఫార్మాట్ లో నిర్వహించనున్న ఈ మెగా ఈవెంట్ కోసం భారత్ లోని వివిధ స్టేడియంలు ముస్తాబవుతున్నాయి. కాగా, ఈ టోర్నీకి మరింత ప్రాచుర్యం కల్పించేలా ఐసీసీ వినూత్న రీతిలో వరల్డ్ కప్ ట్రోఫీని స్ట్రాటో ఆవరణంలోకి పంపింది. 

ఓ వాతావరణ బెలూన్ కు ఈ ట్రోఫీని అనుసంధానం చేసి గాల్లోకి వదిలారు. ఇది భూమికి పైభాగంలోని ట్రోపోస్ఫియర్ కు, మీసోస్ఫియర్ కు మధ్యలో ఉన్న స్ట్రాటో ఆవరణంలోకి చేరుకుంది. అత్యాధునిక 4K కెమెరాలతో ట్రోఫీని ఫొటోలు తీసి, ఆ ఫొటోలను గ్రౌండ్ స్టేషన్ కు పంపారు. అనంతరం ఈ బెలూన్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కిందికి దిగింది. 

కాగా, వరల్డ్ కప్ ట్రోఫీ ప్రపంచయాత్ర జూన్ 27న ప్రారంభం కానుంది. ఆతిథ్యదేశం భారత్ తో పాటు అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, ఉగాండా, నైజీరియా, బహ్రెయిన్, మలేసియా, కువైట్ తదితర 18 దేశాల మీదుగా ఈ ట్రోఫీ ప్రయాణించనుంది.

More Telugu News