Odisha: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సుల ఢీ.. పదిమంది దుర్మరణం

  • ఒడిశా ఆర్టీసీ బస్సు, ప్రైవేటు బస్సు ఢీ
  • మరో ఆరుగురికి తీవ్ర గాయాలు
  • దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం నవీన్ పట్నాయక్
  • మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున పరిహారం
10 killed as two buses collide in Odisha

ఒడిశాలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గంజాం జిల్లాలోని దిగపహండిలో జరిగిందీ ప్రమాదం. గాయపడిన వారిని ఎంకేసీజీ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. 

ప్రయాణికులతో రాయగడ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు,  కందదేవులి గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుక నుంచి జనాన్ని తీసుకుని వెళ్తున్న ప్రైవేటు బస్సు ఢీకొన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 3 లక్షలు, గాయపడిన వారికి రూ. 30 వేల చొప్పున పరిహారం అందించనున్నట్టు ప్రకటించారు.

More Telugu News