Pawan Kalyan: అందుకే నాకు సైట్ వచ్చింది: పవన్ కల్యాణ్

Pawan Kalyan says he got eye sight because of YCP leaders
  • మలికిపురంలో బహిరంగసభ
  • వారాహి వాహనం నుంచి ప్రసంగించిన పవన్ కల్యాణ్
  • వైసీపీ వాళ్ల వల్ల తన కళ్లకు ఛత్వారం పెరిగిపోయిందని చమత్కారం
  • మార్పు రాజోలు నుంచే మొదలుపెడతామని స్పష్టీకరణ
రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల అవినీతి గురించి లెక్కకు మిక్కిలిగా ఉన్న ఫైళ్లు చదివి సైట్ కూడా వచ్చిందని చమత్కరించారు. అప్పుడప్పుడు తాను కళ్లజోడు పెట్టుకుని చదువుతుండడానికి కారణం అదేనని తెలిపారు. వైసీపీ వాళ్ల వల్ల తన కళ్లకు ఛత్వారం పెరిగిపోయిందని నవ్వుతూ చెప్పారు. 

ఉభయ గోదావరి జిల్లాల జనసేన నేతలు బాధ్యతగా వ్యవహరించాలని, స్థానిక వైసీపీ నేతలకు జనసేన నేతలు భయపడ్డా, వారికి సరైన సమాధానం ఇవ్వలేకపోయినా తాను వచ్చి సమాధానం ఇస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గోదావరి నది ఉభయ గోదావరి జిల్లాలను అంటిపెట్టుకుని ప్రవహిస్తూ అంతర్వేదిలో కలుస్తుందని, ఈ పవన్ కల్యాణ్  కూడా ఈ నేలను అలాగే అంటిపెట్టుకుని ఉంటాడని పునరుద్ఘాటించారు. 

తెలంగాణ, ఆంధ్రా విడిపోయినప్పుడు ఉభయ గోదావరి జిల్లాల పచ్చదనాన్ని, కోనసీమ పచ్చదనాన్ని తెగ తిట్టిపోశారని పవన్ వెల్లడించారు. మీకు పచ్చదనం ఉంది, మా ప్రాంతాల్లో పచ్చదనం లేదని అన్నారని తెలిపారు. 

ఇకపై తాను ఇక్కడే ఉంటానని, ప్రతి మండల సమస్యలు తెలుసుకుంటానని, పరిష్కార మార్గాలు రూపొందిస్తానని స్పష్టం చేశారు. జనసేనకు అండగా నిలిచిన రాజోలు నుంచే మార్పును మొదలుపెడదాం అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
Pawan Kalyan
Eye Sight
Malikipuram
Janasena

More Telugu News