Revanth Reddy: ఢిల్లీలో గల్లీల్లో కేటీఆర్ ప్రదక్షిణలు అందుకే: రేవంత్‌రెడ్డి

tpcc chief revanth reddy criticises minister ktrs delhi tour
షార్ట్స్‌లో చూడండి
కేసీఆర్ కుర్చీ కదులుతుందనే మంత్రి కేటీఆర్ ఢిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘‘కేటీఆర్ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదు. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ టూర్‌కి వెళ్లారు. ఐటీ దాడుల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయి. పత్రికల్లో, మీడియాలో రాకుండా కేటీఆర్ మేనేజ్ చేశారు. ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ మోదీకి లొంగిపోయారు” అని ఆరోపించారు. 

ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్‌ను ఎవరూ నమ్మరని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లు కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. రూ.100 కోట్ల లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌పై విచారణ జరిపిస్తున్న మోదీ.. లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్‌ను ఎందుకు విచారణ చేయడంలేదని ప్రశ్నించారు.

‘‘నిన్న వెళ్లి నడ్డాను, అమిత్ షాను కలిసి వచ్చిన బీజేపీ నాయకులు ఇంకా భ్రమలు పెట్టుకోవద్దు. బీజేపీ, బీఆర్ఎస్‌ది తమరు అనుకుంటే తెగిపోయే బంధం కాదు.. ఫెవికాల్ బంధం. మీరు ఎంత కంఠశోష పెట్టుకున్నా మీ మాట ఎవరూ వినరు మీరందరూ కలిసి రండి” అని అన్నారు.

తెలంగాణకు పట్టిన చీడ వదలాలంటే ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ వేదికగానే కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి అని చెప్పారు. తెలంగాణను చివరకు రోడ్లు అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చారని మండిపడ్డారు. కేసీఆర్‌కు ఇష్టమైన ప్రాంతం దుబాయ్ అని, దోచుకున్న సొమ్ముతో అక్కడికే పారిపోతారని ఆరోపించారు.
Go Back to Shorts
Revanth Reddy
KTR
KCR
BJP
delhi

More Telugu News