Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన... పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

Yellow alert for Telangana districts
  • తెలంగాణలో క్రమేణా విస్తరిస్తున్న రుతుపవనాలు
  • వాయవ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం
  • రాగల 5 రోజుల పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు
  • రాగల 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం
  • హైదరాబాదుకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన

నైరుతి రుతుపవనాలు తెలంగాణలో మరింత ముందుకు చొచ్చుకుని పోతున్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. మరోవైపు, వాయవ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. ఈ నేపథ్యంలో, తెలంగాణలో రాగల 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం పేర్కొంది. 

రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వివరించింది. రాగల 24 గంటల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని తెలిపింది. 

అటు, ఐఎండీ సూచనల మేరకు మంచిర్యాల, సిరిసిల్ల, కుమ్రంభీం, కరీంనగర్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉత్తర, ఈశాన్య, మధ్య తెలంగాణ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. 

హైదరాబాద్ నగరానికి మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

  • Loading...

More Telugu News