Life Tax: వాహనాలపై విధించే లైఫ్ ట్యాక్స్ నికర ఇన్ వాయిస్ ధర ఆధారంగానే ఉండాలి: ఏపీ హైకోర్టు

  • వాహనాల లైఫ్ ట్యాక్స్ పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
  • ఎక్స్ షోరూం ధర ఆధారంగా లైఫ్ ట్యాక్స్ వేయరాదన్న న్యాయస్థానం
  • పన్నులన్నింటినీ కలిపిన ధరతో లైఫ్ ట్యాక్స్ వేయడం కుదరదని స్పష్టీకరణ
  • నికర వాహన ధరను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని వెల్లడి
AP High Court verdict on motor vehicles life tax

వాహనాలపై విధించే లైఫ్ ట్యాక్స్ పై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మోటారు వాహనాలపై విధించే లైఫ్ ట్యాక్స్ నికర ఇన్ వాయిస్ ధర ఆధారంగానే ఉండాలని స్పష్టం చేసింది. పన్నులన్నింటినీ కలిపిన వాహన ఎక్స్ షోరూం ధర ఆధారంగా లైఫ్ ట్యాక్స్ విధించడం కుదరదని తేల్చి చెప్పింది. 

లైఫ్ ట్యాక్స్ ను నిర్ణయించే సమయంలో నికర వాహన ధరను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఏపీ మోటారు వాహనాల ట్యాక్సేషన్ చట్టంలోని 6వ షెడ్యూల్ ను ప్రస్తావించింది. ఈ షెడ్యూల్ ప్రకారం లైఫ్ ట్యాక్స్ ను వాహన ధర ఆధారంగానే నిర్ణయించాలన్న విషయం స్పష్టమవుతోందని వివరించింది. 

విజయవాడకు చెందిన తలశిల సౌజన్య, వల్లూరు పవన్ చంద్ అనే ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. తలశిల సౌజన్య... తాను 2019లో హ్యుండాయ్ వెన్యూ కారు కొనుగోలు చేశానని, నిబంధనలకు విరుద్ధంగా 14 శాతం అదనంగా లైఫ్ ట్యాక్స్ విధించారని తన పిటిషన్ లో పేర్కొన్నారు. 

వల్లూరు పవన్ చంద్... తాను 2021లో బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేస్తే నెట్ ఇన్ వాయిస్ ధరను కాదని, ఎక్స్ షోరూం ధర ఆధారంగా లైఫ్ ట్యాక్స్ వేశారని ఆరోపించారు. వీరిరువురు... తమ నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వెనక్కి ఇప్పించాలని తమ పిటిషన్లలో కోర్టును కోరారు. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టు పై విధంగా తీర్పు ఇచ్చింది.

More Telugu News