Karnataka: ఆధార్ కేంద్రానికి మహిళల తాకిడి..తట్టుకోలేక వలవలా ఏడ్చేసిన ఉద్యోగిని

Aadhar center employee in tears after altercation with women in the center
  • కర్ణాటక రాయ్‌చూర్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • ప్రభుత్వ పథకాలకు ఆధార్‌ కార్డు అవసరం పడుతుండటంతో ఆధార్ కేంద్రానికి మహిళలు క్యూకట్టిన వైనం
  • లైన్లో నిలబడమన్న ఉద్యోగినితో వాగ్వాదం
  • ఒత్తిడి తట్టుకోలేక వలవలా ఏడ్చేసిన ఉద్యోగిని

ఆధార్ కేంద్రంలో ప్రజల తాకిడి తట్టుకోలేక ఓ ఉద్యోగిని వలవలా ఏడ్చేసింది. కర్ణాటకలోని రాయ‌చూర్ జిల్లాలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టింది. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్, ఇతర ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. ఈ క్రమంలో మహిళలు తమ ఆధార్ కార్డుల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి పోటెత్తుతున్నారు. 

శనివారం రాయచూర్ తహసీల్దార్ ఆఫీసులో గృహలక్ష్మి, గృహ జ్యోతి పథకాల కోసం ఆధార్ కార్డులో సవరణలు చేయించుకునేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. అదే సమయంలో ఆఫీసులో ఇంటర్నెట్ సమస్య తలెత్తింది. ఈ క్రమంలో మహిళలు కంప్యూటర్ గదిలోకి చొరబడి అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. లైన్లో నిలబడాలన్న ఓ ఉద్యోగినిపై విరుచుకుపడ్డారు. దీంతో, భయపడిపోయిన ఆ యువతి వలవలా ఏడ్చేసింది. పై అధికారులకు చెప్పినా ఉపయోగం లేకపోయిందని ఆమె వాపోయింది. 

కాగా, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో కండక్టర్లకూ సమస్యలు తలెత్తుతున్నాయి. సీట్ల కోసం మహిళలు తొక్కిసలాటకు దిగుతున్నారని, వారించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కొందరు మహిళా కండక్టర్లు పైఅధికారులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News