ఎన్టీఆర్, జయలలితలకు సాధ్యంకానిది కేసీఆర్ సాధించబోతున్నారు: కేటీఆర్
- దక్షిణాదిన ఎవరూ వరుసగా మూడుసార్లు సీఎం కాలేదు
- ఆ ఘనమైన రికార్డును కేసీఆర్ సాధించబోతున్నారు
- ప్రతిపక్షాలను ప్రజలు ఇంటికి పంపించబోతున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని... అయితే ఆ పార్టీలను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయిపోతాడని ఓ పత్రిక నమ్ముతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఎందుకు రాయడం లేదని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిస్సహాయుడని... గోవా టూర్లు, పర్యటనలకే ఆయన పనికొస్తారని అన్నారు. మాట్లాడితే రూ. 1.80 లక్షల కోట్ల నేషనల్ హైవేలు అంటారని... టోల్ కట్టకపోతే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లు పాలించినా సాగునీరు ఇవ్వని ఒక సన్యాసి పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు.
ప్రతి రంగాన్ని పట్టించుకున్నామని... పల్లెలు. పట్టణాలు, వ్యవసాయం, ఐటీ ఇలా ఏ రంగాన్ని విస్మరించలేదని కేటీఆర్ చెప్పారు. ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ కు ప్రజలు ఓటు ఎందుకు వేయకూడదని అన్నారు.