Pre school: క్లాస్ రూంలో చిన్నారిపై దాడి చేసిన బాలుడు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో

  • చేతులతో కొడుతూ.. కాళ్లతో తన్నుతూ దాడి
  • నాలుగైదు నిమిషాల పాటు కొనసాగిన దారుణం
  • బెంగళూరు ప్రీస్కూల్ లో ఘటన
  • సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఘోరం
Pre school girl gets assaulted inside a classroom in Bengaluru

బెంగళూరులోని ఓ ప్రీ స్కూల్ లో దారుణం జరిగింది. క్లాస్ రూంలో నుంచి టీచర్ బయటకు వెళ్లడంతో ఓ బాలుడు మరో చిన్నారిపై దాడి చేశాడు. చేతులతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ దాడి చేయడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. దాదాపు నాలుగైదు నిమిషాల పాటు ఆ చిన్నారిపై దాడి జరిగింది. పిల్లలను చూసుకోవాల్సిన టీచర్ కానీ, ఆయా కానీ లేకపోవడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పాప తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, స్కూలు యాజమాన్యంతో పాటు బాలుడి తల్లిదండ్రులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి ఈస్ట్ బెంగళూరుకు చెందిన సిటిజన్స్ మూమెంట్ ట్విట్టర్ హ్యాండిల్ ఓ వీడియోను పోస్ట్ చేసి పిల్లల తల్లిదండ్రులను హెచ్చరించింది. చిక్కలసండ్రలోని టెండర్ ఫూట్ స్కూల్ లో ఈ ఘటన చోటుచేసుకుందని, ఈ స్కూల్ లో మీ పిల్లలను చేర్పించవద్దని సూచించింది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు చిన్నారుల తల్లిదండ్రులను కన్నీరు పెట్టిస్తున్నాయి. వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహంతో మండిపడుతున్నారు.

క్లాస్ రూంలో నుంచి ఓ టీచర్ లేదా ఆయా బయటకు వెళ్లడంతో ఓ బాలుడు మరో చిన్నారిని కొడుతూ హింసించడం మొదలుపెట్టాడు. మధ్యలో క్లాస్ రూం కిటికీలో నుంచి టీచర్ వస్తున్నది లేనిదీ చూసుకుంటూ పదే పదే చిన్నారిపై దాడి చేశాడు. ఆ చిన్నారిని కింద పడేసి కాళ్లతో తన్నడం, మెడ కొరకడం సీసీటీవీ ఫుటేజీలో చూసి చిన్నారి తల్లి కన్నీటిపర్యంతమైంది. పిల్లలను అలా వదిలేసి వెళ్లడంపై తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీశారు. తలుపు వేసి ఉన్న రూంలో పిల్లలను ఎలా వదిలేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని, చట్టప్రకారం స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

More Telugu News