Southwest Monsoon: భద్రం.. నేడు, రేపు తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

  • ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల సహా పలు జిల్లాల్లో కుమ్మేయనున్న వానలు
  • భారీ వర్షపాతం నమోదయ్యే చాన్స్
  • అప్రమత్తంగా ఉండాలంటూ విపత్తు స్పందన దళాలకు హెచ్చరిక
  • నిజామాబాద్‌లో కొంతభాగం వరకు విస్తరించిన రుతుపవనాలు
Telangana to witness heavy rains today and tomorrow

తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 

అలాగే, మరో ఏడు జిల్లాల్లో 64.5 నుంచి 115.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కాబట్టి ఆయా జిల్లాల్లో విపత్తు స్పందన దళాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో ఆవర్తనం కొనసాగుతోందని వివరించింది.

మొన్న తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు నిన్నటికి నిజామాబాద్ జిల్లాలో కొంతభాగం వరకు విస్తరించాయి. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్‌తోపాటు ఆదిలాబాద్‌లో కొంత భాగం వరకు విస్తారించాల్సి ఉంది.

More Telugu News