Monsoon: తెలంగాణలో ఆరు జిల్లాలకు వర్ష సూచన

  • మరో 24 గంటల్లో రాష్టంలో విస్తరించనున్న రుతుపవనాలు
  • బంగాళఖాతంలో అల్పపీడనం.. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు
  • జూన్ 25, 26 తేదీల్లో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Monsoon enters Telangana rains on for two days

తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరో 24 గంటల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని, పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోని ఆరు జిల్లాలు.. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

హైదరాబాద్ లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. గురువారం నగరంలోని బాలానగర్‌, చింతల్‌, కూకట్‌పల్లి, మాదాపూర్‌, బేగంపేట, ఎల్‌బీనగర్‌, ఘట్‌కేసర్‌, కీసర, బంజారాహిల్స్‌, పంజాగుట్టతో పాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. యాదాద్రిలో కురిసిన భారీ వర్షానికి పార్క్ చేసిన కార్లు నీట మునిగాయి.

నైరుతి రుతుపవనాల రాక ఈ ఏడాది ఆలస్యమైందని ఐఎండీ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఏటా జూన్ 8 - 10 నాటికి తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రం అంతటా విస్తరిస్తాయని చెప్పారు. ఈ ఏడాది మాత్రం 12 రోజులు ఆలస్యంగా వచ్చాయని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త అల్పపీడనం కారణంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. కాగా, జూన్ 25, 26 తేదీల్లో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

More Telugu News