TTD: శ్రీవాణి ట్రస్ట్‌లో అక్రమాల ఆరోపణలు.. శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి

  • టీటీడీలో అవినీతి చేయాలంటే ఎంతటి వాడైనా భయపడాల్సిందేనన్న సుబ్బారెడ్డి
  • మే 31 నాటికి రూ. 861 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడి
  • రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలని మండిపాటు
TTD Released White Paper On Srivani Trust Funds

శ్రీవాణి ట్రస్టుపై వస్తున్న అవినీతి ఆరోపణలపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీలో అవినీతి చేయాలంటే ఎలాంటి వారైనా భయపడాల్సిందేనని అన్నారు. రాజకీయ లబ్ది కోసమే ట్రస్టుపై ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన ఈ మేరకు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఈ ఏడాది మే 31 నాటికి రూ. 861 కోట్ల ఆదాయం వచ్చిందని, ఆ లావాదేవీలు మొత్తం బ్యాంకు ద్వారానే జరిగినట్టు సుబ్బారెడ్డి తెలిపారు. 2018లోనే శ్రీవాణి ట్రస్టు ప్రారంభమైందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019లో ట్రస్టును పునరుద్ధరించినట్టు పేర్కొన్నారు.

దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం రూ. 120.24 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, ఇతర రాష్ట్రాల్లో 127 ప్రాచీన ఆలయాలను పునరుద్ధరిస్తున్నట్టు చెప్పారు. ఈ పనుల కోసం రూ. 139 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో 2,273 ఆలయాల నిర్మాణానికి రూ. 227.30 కోట్లు కేటాయించినట్టు వివరించారు. ట్రస్ట్‌పై అనవసర ఆరోపణలు మానుకోవాలని రాజకీయ నాయకులకు హితవు పలికారు.

More Telugu News