Manipur: మణిపూర్‌లో దారుణ పరిస్థితులు.. ఆయుధాలు చేపట్టి బంకర్లలో నివసిస్తున్న ప్రజలు
- 45 రోజులుగా మండుతున్న మణిపూర్
- జాతుల మధ్య ఘర్షణలతో ఇప్పటి వరకు 100 మందికిపైగా మృతి
- గ్రామాలను, ప్రాణాలను రక్షించుకునేందుకు ఆయుధాలు చేపట్టిన కుకీ, మెయిటీ ప్రజలు
- వారికి వండిపెడుతూ పిల్లలను రక్షించుకుంటున్న మహిళలు
హింసాత్మక ఘటనలతో గత 45 రోజులుగా కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్న మణిపూర్ ప్రజలు ఇప్పుడు ఆయుధాలు చేతబట్టి బంకర్లలో తలదాచుకుంటున్నారు. జాతుల మధ్య ఘర్షణతో మే 3 నుంచి అట్టుడుకుతున్న రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. కుటుంబాలను, ప్రాణాలను, ఊళ్లను కాపాడుకునేందుకు కుకీ, మెయిటీ తెగల ప్రజలు ఇప్పుడు ఆయుధాలతో బంకర్లలో తలదాచుకుంటున్నారు. కాలేజీ కుర్రాళ్లు, ఉద్యోగస్తులు ఇప్పుడు అన్నీ పక్కనపడేసి తమ గ్రామాల రక్షణకు ఆయుధాలు చేతబట్టారు. యువత స్వచ్ఛందంగా ఆయుధాలు చేపట్టగా, పెద్దలు గ్రామాల్లో పహారా కాస్తున్నారు. మహిళలు వారికి వండిపెడుతూ పిల్లలను రక్షించుకుంటున్నారు.
జాతుల మధ్య చెలరేగిన ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా దాదాపు 2 వేల ఇళ్లు, దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. 50 వేల మంది ప్రాణాలు అరచేత పెట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. ఆర్మీ, అస్సాం రైఫిల్స్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసులు, మణిపూర్ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినప్పటికీ రాష్ట్రంలో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
అల్లర్లు తీవ్రంగా ఉన్న కంగ్‌పోక్పి జిల్లాకు చెందిన 48 ఏళ్ల మాజీ సైనికోద్యోగి బాబీ సింగ్ తన కుటుంబాన్ని వేరే ప్రాంతానికి పంపించేసి ఆయన మాత్రం తుపాకులు కాల్చడంలో యువతకు శిక్షణ ఇస్తున్నారు. 21 ఏళ్ల కాలేజీ కుర్రాడు గ్రామాన్ని రక్షించుకునే పనిలో పడ్డాడు. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని తానెప్పుడూ ఊహించలేదని వాపోయాడు.
ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే కుకీ గ్రామాల్లోనూ ఉన్నాయి. హావోపు గుయెటి అనే ప్రైవేటు ఉపాధ్యాయుడు తుపాకి, పేలుడు పదార్థాలు ధరించి తిరుగుతున్నాడు. ఇప్పుడు తనకు ఏడుపు తప్ప మరేమీ మిగలలేదని కన్నీరు పెట్టుకున్నాడు. మణిపూర్‌లో ఏ గ్రామంలో చూసినా ఇప్పుడు ఇలాంటి సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి.