Atchannaidu: రామయ్య మృతికి కారకులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి: అచ్చెన్నాయుడు

  • వైసీపీ శ్రేణుల దాడిలో సాకే రామయ్య మృతి చెందారన్న అచ్చెన్నాయుడు 
  • కారంపూడి టీడీపీ మండలాధ్యక్షుడిపై హత్యాయత్నం చేశారని ఆగ్రహం
  • వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
Atchennaidu demands strict action on those who killed Ramaiah

సత్యసాయి జిల్లా బత్తలపల్లిలో టీడీపీ కార్యకర్త సాకే రామయ్యపై వైసీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడి చేసిన ఘటనలో ఆయన మృతి చెందడం బాధాకరమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల దుశ్చర్యలను ఖండిస్తున్నామని చెప్పారు. రామయ్య మృతికి కారకులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారమదంతో వైసీపీ శ్రేణులు టీడీపీ నేతలు, కార్యకర్తలపై దమనకాండకు పాల్పడుతూనే ఉన్నారని మండిపడ్డారు. 

అదేవిధంగా పల్నాడు జిల్లా కారంపూడి టీడీపీ మండల అధ్యక్షుడు ఉన్నం లక్ష్మీనారాయణ, సైదాపై వైసీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అచ్చెన్న చెప్పారు. చింతపల్లికి చెందిన లక్ష్మీనారాయణ కారంపూడి బస్టాండ్ సెంటర్లో ఉండగా పథకం ప్రకారం వైసీపీ నాయకులు హత్యాయత్నానికి దిగారని చెప్పారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న సీఎం జగన్ రెడ్డి.. తమ అవినీతి, అక్రమాలను, విధ్వంసాన్ని ప్రశ్నించిన టీడీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా భౌతిక దాడులు చేస్తూ హతమారుస్తున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయనేందుకు రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలే నిదర్శనమని అన్నారు. 

తన సోదరిని వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు పదో తరగతి చదివే అమర్ నాథ్ అనే బాలుడిని సజీవ దహనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కత్తిపోట్లు, హత్యలు, సజీవదహనాలు, మానభంగాలు నిత్యకృత్యంగా మారాయని అన్నారు. హింసనే ఆయుధంగా చేసుకున్న వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్ని విషయాన్ని గమనించాలని చెప్పారు.

More Telugu News