truck drivers: ట్రక్కుల్లో డ్రైవర్లకు ఏసీ క్యాబిన్లు.. 2025 నుంచి తప్పనిసరి: కేంద్ర మంత్రి గడ్కరీ

  • దేశంలో తయారయ్యే ప్రతీ ట్రక్కులోనూ డ్రైవర్ క్యాబిన్ లో ఏసీ బిగించాలి
  • ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్న వాటిని అప్ గ్రేడ్ చేయించుకోవాలని సూచన
  • ట్రక్కు డ్రైవర్లు రోజుకు 12 నుంచి 14 గంటలు స్టీరింగ్ ముందే ఉంటారన్న మంత్రి
AC cabins for truck drivers to be mandatory from 2025

భారత దేశంలో ట్రక్కు డ్రైవర్లు శ్రమజీవులని, రోజుకు 12 నుంచి 14 గంటల పాటు స్టీరింగ్ ముందే కూర్చుని ఉంటారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అలాంటి డ్రైవర్లకు సౌకర్యవంతంగా ఉండేలా ట్రక్కులను తీర్చిదిద్దాల్సిందేనని ఆటోమొబైల్ కంపెనీలను ఆదేశించారు. మన దేశంలో 2025 తర్వాత ప్రతీ ట్రక్కులోనూ డ్రైవర్ క్యాబిన్ లో ఏసీ ఏర్పాటు తప్పనిసరి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. దీనికి సంబంధించిన ఫైలుపై సోమవారం సంతకం చేశానని వివరించారు.

ట్రక్కు డ్రైవర్లు 43 డిగ్రీల నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలో విధులు నిర్వహిస్తుంటారని మంత్రి చెప్పుకొచ్చారు. క్యాబిన్ లో ఏసీ బిగించడం వల్ల డ్రైవర్లు మరింత సౌకర్యవంతంగా డ్యూటీ చేస్తారని వివరించారు. వాస్తవానికి తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే ఈ ప్రతిపాదన చేశానని, అయితే ట్రక్కు ఖరీదు పెరిగిపోతుందని, ఏసీ కారణంగా డ్రైవర్లు నిద్రమత్తుతో ప్రమాదాలు పెరుగుతాయని ట్రక్ తయారీదారులు, యజమానులు వాదించారని గడ్కరీ చెప్పారు. 

తాజాగా ట్రక్కుల్లో క్యాబిన్లలో ఏసీలను అమర్చడం తప్పనిసరి చేస్తూ రూల్ తీసుకొస్తున్నట్లు వివరించారు. ఈ రూల్ ప్రకారం.. 2025 నుంచి దేశంలో తయారయ్యే ప్రతీ ట్రక్కులోనూ డ్రైవర్ క్యాబిన్ లో ఏసీ ఏర్పాటు చేయాల్సిందే. అదేవిధంగా ఇప్పటికే రోడ్లపైన తిరుగుతున్న ట్రక్కుల్లో ఏసీ ఏర్పాటు చేయాలని మంత్రి వివరించారు.

More Telugu News