iPhones: లెక్క మారింది.. ఐఫోన్లను దిగుమతి చేసుకోవడం నుంచి.. ఎగుమతి చేయడంలో కొత్త రికార్డులు!

  • మే నెలలో భారత్ నుంచి రూ.12,000 కోట్ల స్మార్ట్‌ఫోన్ల ఎగుమతి
  • అందులో ఐఫోన్ల వాటానే రూ.10 వేల కోట్లు
  • ఇండియా నుంచి ఎగుమతి అవుతున్న స్మార్ట్‌ఫోన్లలో 80 శాతం ఐఫోన్లే
india exported worth rs 10000 cr iphones in may

ఐఫోన్.. సెల్ ఫోన్ బ్రాండ్లలో నంబర్ వన్. మొన్నటిదాకా వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వారు. ఇప్పుడు ఈ లెక్క మారింది. మన దేశం నుంచే ఐఫోన్లు ఎగుమతి అవుతున్నాయి. అది కూడా రికార్డు స్థాయిలో. మే నెలలో భారత్‌ నుంచి రూ.12,000 కోట్ల విలువ చేసే స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి చేస్తే.. అందులో ఐఫోన్ల వాటానే రూ.10 వేల కోట్లు.

‘ఇండియా సెల్యూలార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్ (ఐసీఈఏ)’ వివరాల ప్రకారం.. 2022-23లో భారత్‌ నుంచి ఐదు బిలియన్‌ డాలర్లు విలువ చేసే ఐఫోన్లు ఎగుమతి అయ్యాయి. భారత్‌లో ఈ మైలురాయిని చేరుకున్న తొలి బ్రాండ్‌ ఇదే కావడం గమనార్హం. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే ఐఫోన్‌ ఎగుమతుల విలువ దాదాపు రూ.20 వేల కోట్లకు చేరింది.

క్రితం ఏడాది ఇదే సమయంలో భారత్‌ నుంచి రూ.9,066 కోట్లు విలువ చేసే ఐఫోన్లను విదేశాలకు యాపిల్‌ సంస్థ సరఫరా చేసింది. మరోవైపు ఇండియా నుంచి ఎగుమతి అవుతున్న స్మార్ట్‌ఫోన్లలో 80 శాతం ఐఫోన్లే కావడం మరో విశేషం. మిగిలిన 20 శాతంలో శామ్‌సంగ్‌ సహా ఇతర బ్రాండ్లు ఉన్నాయి.

యాపిల్‌ తమ తయారీ, సరఫరా వ్యవస్థలను చైనా నుంచి వివిధ దేశాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే భారత్‌ నుంచి తయారీ, ఎగుమతులు పుంజుకుంటున్నాయి. ఎయిర్‌పాడ్లను కూడా యాపిల్ భారత్‌లోనే తయారు చేయాలని భావిస్తోంది. 2024- 25 నాటికి 18 శాతం ఐఫోన్ల ఉత్పత్తిని భారత్ లోనే చేపట్టాలని భావిస్తోంది.

More Telugu News