Venkaiah Naidu: న్యాయవ్యవస్థ - చట్టాలపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు

  • చట్టాల రూపకల్పనలో పార్లమెంట్, శాసన సభల ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన వెంకయ్య
  • శాసనం చేసే అధికారాలు శాసనసభలకు మాత్రమే ఉందని వ్యాఖ్య
  • ఎవరైనా తమ పరిధి దాటితే వాళ్లు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చునన్న వెంకయ్య
Venkaiah Naidu comments on judiciary system

చట్టాల రూపకల్పనలో పార్లమెంట్, శాసన సభల ప్రాముఖ్యతను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నొక్కి చెప్పారు. ఈ ప్రక్రియలో న్యాయవ్యవస్థ పాత్ర లేదన్నారు. జాతీయ స్థాయి శాసనకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... న్యాయవ్యవస్థ చట్టాలను చేయలేదని, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల పాత్రలను భారత రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించిందన్నారు. అందుకే తామే అత్యున్నతమని భావించి, ఆయా న్యాయవ్యవస్థలు తమ పరిమితులను అధిగమించకూడదన్నారు.

శాసనం చేసే అధికారం శాసనసభలకు మాత్రమే ఉందన్నారు. శాసన వ్యవస్థ చేసిన చట్టాలు రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉన్నాయో? లేదో? న్యాయవ్యవస్థ నిర్ణయిస్తుందన్నారు. అంతేతప్ప చట్టాలు చేయలేవన్నారు. శాసన సభలు చట్టం చేస్తే, కార్యనిర్వాహక వ్యవస్థ దానిని అమలు చేస్తుందని చెప్పారు. ఈ క్రమంలో ఎవరైనా తమ పరిధి దాటితే వాళ్లు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చునన్నారు.

పార్లమెంటులో చట్టం చేసేంత వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్లు, ఎన్నికల కమిషన్ల నియామక అంశంపై ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఇటీవల ఆదేశించింది. దీంతో రాజ్యంగబద్ధమైన అధికారాల విభజనపై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో వెంకయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

పార్లమెంట్, శాసన సభల్లో పదేపదే అంతరాయాలు ఏర్పడటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు తమ శాసన సభ్యులకు ప్రవర్తనా నియమావళిని రూపొందించాలని సూచన చేశారు. శాసనసభలో, పార్లమెంట్‌లో వికృతంగా ప్రవర్తించడం, పేపర్లు చించివేయడం, మైక్ పగలగొట్టడం వంటివి జరగకుండా చూడాలన్నారు. సభల్లో ప్రతిపక్షం ఉండకూడదని తాను చెప్పనని, సభ్యులకు భిన్నాభిప్రాయాలు సహజమేనని, అలాగే విభేదాలు కూడా ఉండవచ్చునని, అయితే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. వాస్తవానికి నిరసనలు, విభేదాలు, సమ్మతి - అసమ్మతి, వాదనలు అన్నీ కూడా ప్రజాస్వామ్యంలో భాగమన్నారు.

More Telugu News