Ashes: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ కు అంతా రెడీ!

  • ఇంగ్లండ్, ఆసీస్ మధ్య 5 టెస్టుల సమరం
  • నేటి నుంచి తొలి టెస్టు
  • బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానం వేదికగా మ్యాచ్
All set for Ashes wars between host England and Australia

ప్రపంచ క్రికెట్లో భారత్-పాకిస్థాన్... ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్లు తలపడుతుంటే ఆ మజాయే వేరు. ఆ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంటే క్రికెట్ పోటీలా కాకుండా యుద్ధాన్ని తలపించే రీతిలో ఆవేశాలు, ఉద్రిక్తతలు కనిపిస్తుంటాయి. మైదానంలో సీట్లు ఖాళీగా ఉండడం అనేది దాదాపు జరగని పని. అలాంటి ఓ క్రికెట్ యుద్ధమే యాషెస్. 

క్రికెట్ కు పుట్టినిల్లు ఇంగ్లండ్ కు, ఆస్ట్రేలియాకు మధ్య జరిగే ఈ టెస్టు సమరం అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ సిరీస్ లో బ్యాట్స్ మన్ ఒక్క సెంచరీ కొట్టినా, బౌలర్ 5 వికెట్లు తీసినా... వాళ్లిక హీరోలే. ఇప్పుడు ఆ యాషెస్ కు సర్వం సిద్ధమైంది. ఈసారి యాషెస్ కు ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తోంది. తొలి టెస్టు నేడు ప్రారంభం కానుంది. ఎడ్జ్ బాస్టన్ మైదానం ఈ మ్యాచ్ కు వేదికగా నిలుస్తోంది. 

యాషెస్ లో భాగంగా ఇప్పటివరకు 72 సిరీస్ లు జరగ్గా... ఆసీస్ 34, ఇంగ్లండ్ 32 సిరీస్ లు నెగ్గాయి. 6 సిరీస్ లు డ్రాగా ముగిశాయి. ఇక ఇంగ్లండ్ చివరిసారిగా యాషెస్ నెగ్గింది 2015లో. అప్పటి నుంచి ఇంగ్లండ్ జట్టు యాషెస్ కరవుతో బాధపడుతోంది. 

ఇటీవల బజ్ బాల్ క్రికెట్ (టీ20లు, వన్డేలు, టెస్టులని తేడా లేకుండా బంతిని చితకబాదడమే బజ్ బాల్ క్రికెట్) తో దుమ్మురేపుతున్న ఇంగ్లండ్ సొంతగడ్డ ఆధిక్యతతో ఆసీస్ ను మట్టికరిపించాలని కృతనిశ్చయంతో ఉంది. అటు, వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ ను ఓడించి రెట్టించిన ఉత్సాహంతో ఆసీస్ యాషెస్ బరిలో దిగుతోంది. ఆసీస్ చివరిసారిగా 2021-22 సీజన్ లో యాషెస్ ను 4-0తో చేజిక్కించుకుంది.


ఇంగ్లండ్...
బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్ స్టో, స్టూవర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, డాన్ లారెన్స్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్, ఓలీ రాబిన్సన్, జో రూట్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్, మార్క్ ఉడ్.

ఆస్ట్రేలియా...
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజెల్ వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, మిచెల్ మార్ష్, టాడ్ మర్ఫీ, మాట్ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్.

More Telugu News