Groom: కట్నం అడిగాడని వరుడిని చెట్టుకు కట్టేసిన వధువు కుటుంబం

  • యూపీలోని ప్రతాప్ గఢ్ లో ఘటన
  • వరుడి స్నేహితుల అనుచిత ప్రవర్తనతో పెళ్లి వేడుకలో గొడవ
  • వరుడిని విడిపించి అదుపులోకి తీసుకున్న పోలీసులు
Groom tied to a tree by bride family for demanding dowry in UPs Pratapgarh

బంధువులు, స్నేహితులు, పెళ్లి బాజాలతో అప్పటిదాకా కళకళలాడుతున్న ఓ వివాహ వేడుక ఒక్కసారిగా గందరగోళంగా మారింది. వధువు కుటుంబ సభ్యులు.. వరుడిని చెట్టుకు కట్టేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో చోటు చేసుకుంది. పెద్దలు కుదిర్చిన ఓ వివాహంలో భాగంగా అక్కడి సంప్రదాయ 'జై మాల' వేడుకలో వరుడు, వధువు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వరుడు అమర్జీత్ వర్మ స్నేహితులు అనుచితంగా ప్రవర్తించడంతో వధూవరుల కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పరిస్థితికి మరింత ఆజ్యం పోస్తూ వరుడు అమర్జీత్ వధువు కుటుంబం నుంచి కట్నం మరింత డిమాండ్ చేయడంతో పరిస్థితి చేయిదాటింది.  

పలు దఫాలుగా చర్చలు జరిపినా ఇరు కుటుంబాలు ఒక అంగీకారానికి రాకపోవడంతో వధువు తరఫు వాళ్లు వరుడిని చెట్టుకు కట్టేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వరుడిని విడిపించి అదుపులోకి తీసుకున్నారు. ‘వరుడి స్నేహితులు దురుసుగా ప్రవర్తించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈలోగా వరుడు అమర్జీత్ కట్నం కోసం డిమాండ్ చేశాడు. పెళ్లి రద్దవడంతో  వివాహ వేడుక ఏర్పాట్ల కోసం అమ్మాయి తరపు వారు చేసిన ఖర్చులు, పరిహారం కోసం రెండు కుటుంబాల మధ్య చర్యలు జరుగుతున్నాయి’ అని పోలీసులు తెలిపారు.

More Telugu News