Ghulam Nabi Azad: విపక్షాలు కలవడం వల్ల ఉపయోగం లేదు.. జగన్ కు కాంగ్రెస్ ఏం ఇవ్వగలదు?: గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు

  • విపక్షాల మధ్య సీట్ల పంపకం సమస్యకు దారి తీస్తుందన్న ఆజాద్
  • పొత్తు ధర్మంలో సీట్లను పంచుకోవాల్సి ఉంటుందని, అది అంత ఈజీ కాదని వ్యాఖ్య
  • బలమైన నాయకత్వం ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పుంజుకుంటోందన్న ఆజాద్
Ghulam Nabi Azad on opposition unity

2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే విపక్షాల ఐక్యత అనేది పెద్దగా ఫలితం ఇవ్వకపోవచ్చని డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధినేత గులాం నబీ ఆజాద్ (కాంగ్రెస్ మాజీ నేత) అభిప్రాయపడ్డారు. పాట్నాలో విపక్షాలతో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఏర్పాటు చేస్తున్న సమావేశంపై ఆజాద్ స్పందిస్తూ... ఈ సమావేశం వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని అన్నారు. ఈ సమావేశానికి తాను హాజరుకావడం లేదని స్పష్టం చేశారు. 

విపక్షాలు కలవడంలో పెద్ద ఆశ్చర్యం లేదని... అయితే, వివిధ రాష్ట్రాల్లో ఆయా పార్టీల మధ్య సీట్ల పంపకం సమస్యకు దారి తీస్తుందని ఆజాద్ చెప్పారు. పొత్తు ధర్మంలో 50-50 లేదా 60-40 నిష్పత్తిలో సీట్లను పంచుకోవాల్సి ఉంటుందని... అయితే ఇది జరిగే పని కాదని అన్నారు. 

పశ్చిమబెంగాల్ విషయానికి వస్తే... కాంగ్రెస్, సీపీఐ కూటమికి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని... అలాంటప్పుడు విపక్షాల పొత్తు ధర్మంలో భాగంగా కాంగ్రెస్ కు సీట్లను కేటాయించడం వల్ల మమతా బెనర్జీకి వచ్చే బెనెఫిట్ ఏమిటని ప్రశ్నించారు. ఇదే విధంగా రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని... అలాంటప్పుడు టీఎంసీకి వారు అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించే పరిస్థితి ఉంటుందా? అనే సందేహాన్ని లేవనెత్తారు. 

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఆంధ్రప్రదేశ్ మినహా మరే రాష్ట్రంలో ప్రాతినిధ్యం లేదని... ఇదే సమయంలో ఏపీలో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని ఆజాద్ చెప్పారు. ఈ నేపథ్యంలో జగన్ కు కాంగ్రెస్ ఏమి ఇవ్వగలదని, కాంగ్రెస్ కు జగన్ ఏమి ఇవ్వగలరని ప్రశ్నించారు. విపక్షాల ఐక్యత అనేది కేవలం ఫొటోలకు మాత్రమే బాగుంటుందని చెప్పారు.

అయితే, రాబోయే ఎన్నికల్లో విపక్షాలన్నీ ఐక్యంగా బీజేపీని ఓడించాలని ఆజాద్ ఆకాంక్షించారు. విపక్షాలు కలిసినా, కలవకపోయినా ఆయా పార్టీలు గెలుచుకునే సీట్లలో పెద్దగా మార్పు ఉండదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బలహీనంగా ఉందని, ఇదే సమయంలో రాష్ట్రాల్లో బలంగానే ఉందని అన్నారు. ఏ రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం ఉందో... ఆయా రాష్ట్రాల్లో ఆ పార్టీ పుంజుకుంటోందని చెప్పారు. 

గతానికి, ఇప్పటికి కాంగ్రెస్ లో వచ్చిన మార్పు ఏమిటంటే... గతంలో రాష్ట్రాలను కేంద్ర నాయకత్వం నడిపించేదని... ఇప్పుడు కేంద్ర నాయకత్వాన్ని రాష్ట్రాల నాయకత్వాలు నడిపిస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం ఉనికిని కోల్పోయిందని... రాష్ట్ర నేతలే స్వయంగా ఆ పార్టీని గెలిపించుకుంటున్నారని చెప్పారు.

More Telugu News