Gutha Sukender Reddy: చంద్రబాబు ఎంపీ టికెట్ ఇవ్వలేదు.. వైఎస్సార్ రమ్మన్నారు: గుత్తా సుఖేందర్ రెడ్డి

  • భట్టి పాదయాత్ర సక్రమంగా జరగడం లేదన్న గుత్తా
  • పాదయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకుంటున్నారని ఎద్దేవా
  • కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేశారని కితాబు
Chandrababu denied me MP ticket says Gutha Sukender Reddy

తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్రపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. భట్టి పాదయాత్ర సక్రమంగా జరగడం లేదని... అది ఒక కలహాల పాదయాత్ర అని అన్నారు. ఆయన పాదయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకుంటున్నారని చెప్పారు. భట్టి పాదయాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రోజుకు మూడు కిలోమీటర్లు మాత్రమే భట్టి నడుస్తున్నారని... ఇదేం పాదయాత్ర అని ఎద్దేవా చేశారు. 

భట్టి విక్రమార్క పాదయాత్ర నల్గొండ జిల్లా దాటేది కూడా ఉండదని గుత్తా అన్నారు. నల్గొండ జిల్లా రాజకీయాలపై భట్టికి ఏమాత్రం అవగాహన లేదని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞం పేరుతో ప్రారంభించిన ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో చిత్తశుద్ధితో పూర్తి చేశారని కొనియాడారు. 

చంద్రబాబు తనకు ఎంపీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించారని... అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ లో చేరానని గుత్తా తెలిపారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలను చూడలేక బీఆర్ఎస్ లోకి వెళ్లానని చెప్పారు. 1999 ఎన్నికల్లో గుత్తా టీడీపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్) చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి 2009, 2014లో ఎంపీగా గెలుపొందారు.

More Telugu News