TCS: మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్న టీసీఎస్ మహిళా ఉద్యోగులు.. ఎందుకంటే..!

  • వర్క్ ఫ్రం హోం ఇక చాలు.. ఆఫీసుకు రమ్మనడంతో రాజీనామాలు
  • దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటిగా పేరొందిన టీసీఎస్
  • సంస్థలో పురుషులతో పాటు మహిళలకు సమానంగా అవకాశాలు
Mass Resignation Of Female Employees At TCS As IT Giant Ends Work From Home

దేశంలో పేరొందిన ఐటీ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తాజాగా ఓ కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. సంస్థలోని మహిళా ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తుండడం ఉన్నత స్థాయిలోని అధికారులను కలవరపెడుతోంది. గతంలో రాజీనామా చేసి వెళ్లిపోయే మహిళా ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండేదని, తాజాగా ఈ సంఖ్య పెరిగిపోయిందని టీసీఎస్ వర్గాలు వెల్లడించాయి.

మిగతా కారణాలు కూడా ఉన్నప్పటికీ ప్రధాన కారణం మాత్రం ‘వర్క్ ఫ్రం హోం’ ఎత్తేయాలన్న నిర్ణయమేనని ఉద్యోగులు అంటున్నారు. కరోనా కాలంలో అమలు చేసిన వర్క్ ఫ్రం హోం సౌకర్యంతో కాస్త వెసులుబాటు దొరుకుతోందని, మళ్లీ ఆఫీసులకు రమ్మనడంతో ఆ వెసులుబాటును వదులుకోలేక రాజీనామాలకు సిద్ధపడుతున్నారని చెబుతున్నారు. పురుషులతో పాటు మహిళలకూ సమానంగా అవకాశాలు ఉంటాయని, వివక్ష ఉండదని టీసీఎస్ సంస్థపై ఉద్యోగుల అభిప్రాయం.

టీసీఎస్ లో మొత్తంగా ఆరు లక్షల పైచిలుకు ఉద్యోగులు ఉండగా.. అందులో 35 శాతం మంది మహిళలే. అంతేకాదు, టాప్ పొజిషన్లలోనూ మహిళలకు కంపెనీ తగిన ప్రాధాన్యం కల్పిస్తోంది. నాలుగింట మూడొంతుల మంది మహిళలు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. కరోనా ముందు వరకు సంస్థలోని మహిళా ఉద్యోగులు రాజీనామా చేసేందుకు ఇష్టపడేవారు కాదని, ఇటీవల మాత్రం ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా రాజీనామాలు చేస్తున్నారని కంపెనీ హెచ్ ఆర్ విభాగానికి చెందిన ఉద్యోగులు చెబుతున్నారు.

కరోనా లాక్ డౌన్ తర్వాత ఐటీ కంపెనీలు చాలా వరకు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా కోరాయి. ఆమేరకు ఉద్యోగులు ఏర్పాట్లు చేసుకునేందుకు సాంకేతిక, ఆర్థిక సహకారం అందించాయి. ఈ వెసులుబాటుతో ట్రాఫిక్ కష్టాలకు, హడావుడి జీవితానికి స్వస్తి పలికిన ఉద్యోగులు.. ఇదే తమకు కంఫర్ట్ గా ఉందని చెప్పారు. ఇకపై ఆఫీసుకు వెళ్లే ఆలోచనే రానీయబోమని దాదాపు 25 శాతం మంది ఉద్యోగులు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

కరోనా సెకండ్ వేవ్ ముగిసిపోయాక కంపెనీలు ఒక్కొక్కటిగా ‘వర్క్ ఫ్రం హోం’ విధానాన్ని ఎత్తేయడం ప్రారంభించాయి. ఈ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆఫీసుకు వచ్చేది లేదని, అవసరమైతే ఉద్యోగమే వదులుకుంటామని తేల్చిచెప్పారు. అన్నట్లుగానే ఉద్యోగం మానేసి వర్క్ ఫ్రం హోం సదుపాయం ఉన్న కంపెనీలకు మారిపోతున్నారు. తాజాగా ఈ సెగ టీసీఎస్ కు కూడా తగిలింది.

More Telugu News