Jack Dorsey: ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కేంద్రమంత్రి

  • కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన
  • ఆ సమయంలో ప్రభుత్వం నుంచి అభ్యర్థనలు వచ్చాయన్న డోర్సే
  • పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్న కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్
India threatened to shut down Twitter  says Jack Dorsey

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సమయంలో ప్రభుత్వం నుంచి తమకు తీవ్ర ఒత్తిడి ఎదురైందంటూ ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సాంకేతిక, సమాచారశాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని కొట్టిపడేశారు. 

ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఇటీవల పాల్గొన్న జాక్ డోర్సే భారత ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాలపై రైతుల ఆందోళనలు, విమర్శలు చేసే జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వం నుంచి తమకు చాలా అభ్యర్థనలు వచ్చాయని, భారత్‌లో ట్విట్టర్‌ను మూసేస్తామని కూడా కొందరు బెదిరించినట్టు చెప్పారు. ట్విట్టర్ ఉద్యోగుల ఇళ్లలో తనిఖీలు చేస్తామన్న హెచ్చరికలు కూడా వచ్చాయన్నారు. అయితే, ఈ బెదిరింపులు ఎవరి నుంచి వచ్చాయన్న దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. 

డోర్సే వ్యాఖ్యలపై మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తీవ్రంగా స్పందించారు. ఆయన అబద్ధాలు చెబుతున్నారని, ఆయన వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. అంతేకాదు, డోర్సే హయాంలో 2020-22 మధ్య భారత్‌లో ట్విట్టర్ పదపదే నిబంధనలు ఉల్లంఘించిందని చెప్పారు. డోర్సే హయాంలో భారత సార్వభౌమత్వాన్ని అంగీకరించేందుకు ట్విట్టర్ ఇష్టపడలేదని పేర్కొన్నారు.

రైతుల ఆందోళన సమయంలో నరమేధంలాంటి తీవ్రమైన అసత్య ప్రచారాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అడ్డుకుందని పేర్కొన్నారు. ఇలాంటి సమాచారమే అమెరికాలో వ్యాప్తి చెందితే వెంటనే దానిని తొలగించారని, ఇక్కడ మాత్రం దానిని తొలగించేందుకు వారికి ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. ట్విట్టర్ ఉద్యోగుల ఇళ్లపై తనిఖీలు చేయలేదని, ఎవరినీ జైలుకు పంపలేదని స్పష్టం చేశారు.

More Telugu News