Team India: వచ్చే నెల నుంచే మరో డబ్ల్యూటీసీ బరిలోకి భారత జట్టు

  • జులైలో వెస్టిండీస్ తో రెండు టెస్టులు ఆడనున్న భారత్
  • ఆగస్టు వరకు విండీస్ లో పర్యటించనున్న జట్టు
  • మూడు వన్డేలు, ఐదు టీ20ల్లో విండీస్ తో పోటీ
India to begin next WTC cycle with two match series in Caribbean

వరుసగా రెండు పర్యాయాలు ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు అర్హత సాధించిన భారత జట్టు ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టింది. రెండోసారి కూడా ‘టెస్టు గద’ను అందుకోవడంలో విఫలమైంది. ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో చిత్తుగా ఓడింది. ఆ పరాజయాన్ని మరిచిపోయి 2023–2025 డబ్ల్యూటీసీ ఎడిషన్ పై రోహిత్ సేన ఫోకస్ పెట్టనుంది. రాబోయే ఎడిషన్ డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు కోసం వచ్చే నెల నుంచే తన ప్రయాణం మొదలు పెట్టనుంది. డబ్ల్యూటీసీ కొత్త సైకిల్ లో భాగంగా జులైలో వెస్టిండీస్ తో భారత్ తొలి టెస్టు సిరీస్ ఆడనుంది. జులై-ఆగస్టులో మూడు ఫార్మాట్ల సిరీస్ ల కోసం భారత్..  వెస్టిండీస్‌ లో పర్యటించనుంది. ఇందులో భాగంగా తొలుత విండీస్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. 

జులై 12 నుంచి 16వ తేదీ వరకు డోమినికాలో తొలి మ్యాచ్‌, ట్రినిడాడ్‌లోని క్వీన్స్‌ ఓవల్‌ పార్క్‌లో 20–24 తేదీల్లో రెండో టెస్టు జరగనున్నాయి. అనంతరం వన్డే ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా కరీబియన్ జట్టుతో మూడు వన్డేల సిరీస్ లో పోటీ పడనుంది. జులై 27, 29న తొలి రెండు వన్డేలు బార్బడోస్‌లో, ఆగస్టు 1న ఆఖరి వన్డే ట్రినిడాడ్‌లో జరగుతాయి. చివరగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని టీ20 జట్టు.. వెస్టిండీస్ తో ఐదు టీ20ల్లో పోటీ పడనుంది. ఆగస్టు 3, 6, 8, 12, 13వ తేదీల్లో టీ20 సిరీస్‌ను షెడ్యూల్‌ చేశారు. తొలి టీ20 ట్రినిడాడ్‌లో, రెండు, మూడో మ్యాచ్‌లు గయానాలో నిర్వహిస్తారు. చివరి రెండు టీ20లు అమెరికా, ఫ్లోరిడాలోని లాడర్‌ హిల్స్‌ లో జరుగుతాయి.

More Telugu News