hari rama jogaiah: ఇందులో పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ ఏముంది?: హరిరామ జోగయ్యపై హైకోర్టు ఆగ్రహం

  • జగన్‌ అక్రమాస్తుల కేసులను తేల్చేలా ఆదేశాలు ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టులో హరిరామ జోగయ్య పిల్
  • పిటిషన్‌లో ప్రజాసక్తి ఉందని మీకైనా అనిపిస్తోందా? అని హైకోర్టు ప్రశ్న
  • మాజీ ఎంపీగా ఉండి ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని అసహనం
telangana high court angry at harirama jogaiah over pil against cm jagan

మాజీ ఎంపీ హరిరామ జోగయ్యపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రచార ప్రయోజనాల కోసం పిల్‌ వేశారా? అంటూ ప్రశ్నించింది. కోర్టు విలువైన సమయాన్ని వృథా చేసేందుకు ప్రయత్నించారంటూ సీరియస్ అయింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోపే ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులను తేల్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఆయన దాఖలు చేశారు. సీబీఐ కోర్టులో జగన్‌ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని కోరారు.

సోమవారం ఈ మేరకు హరిరామ జోగయ్య తరఫు న్యాయవాది వాదనలు వినిపించేందుకు సిద్ధం కాగా.. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కలుగజేసుకుంది. ‘‘ఇదో పబ్లిక్‌ న్యూసెన్స్‌. ఇందులో పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ ఏముంది? వ్యక్తిగత కక్షతోనే పిల్‌ దాఖలు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఓ మాజీ ఎంపీ అయ్యి ఉండి మీరు ఇలా వ్యవహరించడం ఆమోద యోగ్యం కాదు’’ అని అసహనం వ్యక్తం చేసింది.

‘‘జగన్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసుల విచారణ త్వరగా పూర్తి చేసేలా చూడాలని పిటిషన్ వేశారు. ‘రాష్ట్రపతికి లేఖ రాశాం.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం..’ అని అంటారా!. ఇది ఏం పద్ధతి? ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి చెప్పినంత మాత్రాన కింది స్థాయి కోర్టు భయపడి పనిచేయదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని సూచించింది.

మీరు దాఖలు చేసిన పిటిషన్‌లో అసలు ఎక్కడన్నా ప్రజాసక్తి ఉందని మీకైనా అనిపిస్తోందా? అని ప్రశ్నించింది. ‘‘ఈ మధ్య తెలంగాణ గవర్నర్‌ చెప్పినట్లు ఇలాంటి పబ్లిక్‌ న్యూసెన్స్‌ కేసులు ఎక్కువయ్యాయి. కొందరికి ఇలాంటి పిటిషన్లు వేయడమే పరిపాటిగా మారింది. మీరు అడిగారు కదా అని వెంటనే విచారణ చేపట్టలేం’’ అని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. విచారణను జులై 6కు వాయిదా వేసింది.

More Telugu News