Uttar Pradesh: యూపీ బీజేపీ నేత హత్య.. భార్య అరెస్ట్

  • పశ్చిమ యూపీ బీజేవైఎం సోషల్ మీడియా ఇన్చార్జీగా వ్యవహరిస్తున్న గార్గ్
  • గార్గ్ ఛాతీలోకి దూసుకుపోయిన బుల్లెట్
  • గార్గ్ భార్యకు జ్యుడీషియల్ కస్టడీ విధింపు
BJP leader murdered and his wife arrested

బీజేపీ నేత హత్య కేసులో ఆయన భార్యను మీరట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే నిశాంత్ గార్గ్ అనే బీజేపీ నేత హత్యకు గురయ్యారు. ఆయన డెడ్ బాడీని నిన్న గుర్తించారు. మృతదేహంపై తుపాకీ బుల్లెట్ గాయాలున్నాయి. ఈ క్రమంలో నిన్న రాత్రి ఆయన భార్య సోనియాను అరెస్ట్ చేసినట్టు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ సింగ్ సాజ్వాన్ తెలిపారు. సోనియాపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మృతుడి సోదరుడు గౌరవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారని... ఆయన ఫిర్యాదు మేరకు కుట్రపూరిత హత్య కేసును నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశామని చెప్పారు. ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా... కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీని విధించిందని తెలిపారు. 

తన భర్త తనను నాటు తుపాకీతో కాల్చాలనుకున్నాడని... ఆ క్రమంలో జరిగిన కొట్లాటలో తుపాకీ ఒక రౌండు పేలి తన భర్త ఛాతీలోకి దూసుకెళ్లిందని విచారణలో సోనియా చెప్పినట్టు పోలీసు అధికారి తెలిపారు. శనివారం ఉదయం తన భర్త ఆత్మహత్యకు కూడా యత్నించాడని తెలిపారని అన్నారు. శుక్రవారం రాత్రి విపరీతంగా తాగి తనను కొట్టాడని చెప్పారని అన్నారు. హత్యా స్థలిలో తొలుత పిస్టల్ కనిపించలేదని... దాని గురించి విచారణలో సోనియాను ప్రశ్నించగా ఒక అల్మరా నుంచి పిస్టల్ తో పాటు గార్గ్ మొబైల్ ను కూడా తీసుకొచ్చి ఇచ్చిందని చెప్పారు. మృతుడు గార్గ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ బీజేపీ యువమోర్చా సోషల్ మీడియా ఇన్చార్జీగా వ్యవహరిస్తున్నారు.

More Telugu News