Sathya Kumar: నడ్డా వచ్చి నాలుగు ప్రశ్నలేస్తేనే ఉలిక్కిపడుతున్నారు: సత్యకుమార్

Sathya Kumar fires on Perni Nani and YCP leaders
షార్ట్స్‌లో చూడండి
మాజీ మంత్రి పేర్ని నాని స్థాయి మరిచి మాట్లాడుతున్నారంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ధ్వజమెత్తారు. నిన్న జేపీ నడ్డా మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని, రాష్ట్రానికి రాజధాని లేదని అన్నారని, అది నిజం కాదా? అని సత్యకుమార్ ప్రశ్నించారు. ఒక్కసారి అధికారంలోకి వచ్చినందుకే ఇంత గర్వమా? అని మండిపడ్డారు. 

"ప్రభుత్వ అవినీతి, అక్రమాలపైనే నిన్న జేపీ నడ్డా మాట్లాడారు. ఇసుక, గనులు, మద్యంలో అవినీతి జరుగుతోందా, లేదా? ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారా, లేదా? నడ్డా వచ్చి నాలుగు ప్రశ్నలు వేస్తేనే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? 

తాత, తండ్రుల పేరు చెప్పి మేం అధికారం చేయడంలేదు. రాష్ట్రానికి రాజధాని ఉండాలా, వద్దా? అనేది జగన్ చెప్పాలి. విశాఖలో ఎక్కడ చూసినా భూకబ్జాలు, ఆక్రమణలే. పాలనా రాజధాని పేరుతో విశాఖలో విధ్వంసాలు చేస్తున్నారు. విశాఖలో వారికి ఇష్టం వచ్చిన భవనాలు కడుతున్నారు. రేషన్ బియ్యం పాలిషింగ్ చేసి విదేశాలకు అమ్ముకుంటున్నారు. 

పథకాలు కేంద్రానివి... పేరు మాత్రం మీది. జల్ జీవన్ మిషన్ కు రాష్ట్ర వాటా ఇవ్వడంలేదు. పోలవరానికి ఇచ్చిన నిధుల్లోనూ కమీషన్లు కొట్టేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని మీరు నడ్డాను విమర్శిస్తారా?" అంటూ సత్యకుమార్ నిప్పులు చెరిగారు.
Go Back to Shorts
Sathya Kumar
Perni Nani
BJP
JP Nadda
YSRCP
Andhra Pradesh

More Telugu News