YS Sharmila: కేటీఆర్ తల పొగరు హిమాలయాలకు పాకింది: షర్మిల

  • కేటీఆర్ పై షర్మిల విమర్శలు
  • మీ చేతకాని పాలనే తెలంగాణకు పెద్ద లోపం అని స్పష్టీకరణ
  • మీ పాలన ఫాంహౌస్ కే పరిమితమైందని వెల్లడి
Sharmila slams KTR

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ మంత్రి కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. చిన్నదొర కేటీఆర్ తలపొగరు హియాలయాలకు పాకిందని పేర్కొన్నారు. "ప్రజాదర్బార్ పెట్టవద్దట... ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి చెప్పుకోవద్దట... అలా చేస్తే వ్యవస్థలో లోపం ఉన్నట్లట" అంటూ షర్మిల మండిపడ్డారు. లోపం వ్యవస్థలో కాదు కేటీఆర్ గారూ... మీ చేతకాని పాలనే తెలంగాణకు పెద్ద లోపం అని స్పష్టం చేశారు. 

ప్రజాదర్బార్ చేయాలంటే ప్రజలకు మంచి చేస్తామన్న నమ్మకం ఉండాలి... ప్రజల సమస్యలు తీర్చాలన్న మంచి మనసు ఉండాలి... ప్రజల మధ్య దర్బార్ పెట్టాలంటే దమ్ము ధైర్యం ఉండాలి అని షర్మిల వివరించారు. అది లేకనే తొమ్మిదేళ్లుగా ఫాంహౌస్ కే పరిమితం అయింది మీ పాలన అంటూ విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఉపన్యాసాలు ఇచ్చినా జనం నమ్మేస్థాయిలో లేరని తెలిపారు. 

అందుకే జనం మీరు ఎక్కడ పర్యటిస్తే అక్కడ మీ కార్లను వెంబడించి కొడుతున్నారు... ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ నిలదీస్తున్నారు... చేతకాని దద్దమ్మలు అని తిడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా మెక్కుతూ, జనం ఏమైపోతే మాకేంటని చూసే దద్దమ్మలు  మీరు అంటూ ధ్వజమెత్తారు. 

"పింఛను, రేషన్ కార్డు, పాస్ బుక్ లో పేరు మార్పు కోసం ముఖ్యమంత్రి కోసం రావొద్దంట. కొత్త పింఛన్ల కోసం 15 లక్షల మంది సీఎం సంతకం కోసం వేచిచూస్తుంటే అది వ్యవస్థలో లోపమా? కేసీఆర్ పనితీరులో లోపమా? నాలుగేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వకపోవడం, లక్షల ఫైళ్లు పెండింగ్ లో పెట్టడం వ్యవస్థలో లోపమా? కేసీఆర్ పనితీరులో లోపమా?" అంటూ షర్మిల వ్యాఖ్యానించారు. 

ప్రజాదర్బార్ పెట్టి ప్రజలకు ఏంకావాలో అడిగిన ఏకైక దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్సార్ మాత్రమేనని, ప్రజా సమస్యలు వినాలన్నా, పరిష్కారం కావాలన్నా మళ్లీ వైఎస్సార్ పాలనతోనే అది సాధ్యమని షర్మిల స్పష్టం చేశారు.

More Telugu News