Ravi Shastri: అసాధ్యమేమీ కాదు.. ప్రపంచ రికార్డును చూడబోతున్నాం..: డబ్ల్యూటీసీ ఫైనల్ పై రవిశాస్త్రి

  • 444 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆడుతున్న టీమిండియా 
  • ప్రస్తుత స్కోరు 164/3.. గెలవాలంటే ఐదో రోజు మరో 280 పరుగులు చేయాలి
  • ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని టీమిండియా ఛేదిస్తుందన్న రవిశాస్త్రి
Strange things can happen and Indian win very much a possibility on Day 5 says Ravi Shastri

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) సమరం క్లైమాక్స్ కు చేరుకుంది. ఫైనల్ టెస్టు మ్యాచ్ చివరి రోజుకు చేరుకుంది. 444 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను టీమిండియా కొనసాగిస్తోంది. ప్రస్తుతం 164/3 స్కోరుతో ఉంది. టీమిండియా గెలవాలంటే ఐదో రోజు మరో 280 పరుగులు చేయాలి. ఏడు వికెట్లను పడగొడితే ఆసీస్‌ ఛాంపియన్‌గా నిలుస్తుంది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ, రహానె ఉండటంతో భారత్‌కు ఆశలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. 

చివరి రోజు 280 పరుగులు చేయడం కష్టమేమీ కాదని, సాధ్యమేనని రవిశాస్త్రి అన్నాడు. మనం ఈ మ్యాచ్‌లో తప్పకుండా కొత్త రికార్డులను చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రపంచ రికార్డు లక్ష్యాన్ని టీమిండియా ఛేదిస్తుందనడంలో తనకు ఎలాంటి అనుమానం లేదని అన్నాడు. ‘‘ఫలితం గురించి ఆందోళన పడకుండా ఆదివారం తొలి సెషన్‌ను కాచుకుంటే చాలు. ఎందుకంటే పిచ్‌ పరిస్థితి అలా ఉంది. నాలుగో రోజు ఆటలో రోహిత్ శర్మ, పుజారా తమ తప్పిదాల వల్లే పెవిలియన్‌కు చేరారు’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. 

మరోవైపు పేసర్ మహ్మద్‌ షమీ కూడా సానుకూలంగా స్పందించాడు. భారీ ఛేదనలో తమ టీమ్ తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ‘‘ఇదేమీ పెద్ద కష్టంగా అనిపించడం లేదు. కాకపోతే ప్రతి ఒక్కరూ వందశాతం నమ్మకంతో ఉండాలి. తప్పకుండా మనం విజయం సాధిస్తాం’’ అని అన్నాడు. ‘‘ప్రపంచంలోని అన్ని మైదానాల్లో మంచి ప్రదర్శనే ఇస్తున్నాం. అందుకే మనం ఈ మ్యాచ్‌లో విజయ సాధిస్తామనే నమ్మకం ఉంది. భారీ టార్గెట్‌ ఉందని కంగారుపడకుండా జాగ్రత్తగా ఆడితే సరిపోతుంది’’ అని షమీ చెప్పుకొచ్చాడు.

టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక లక్ష్య ఛేదన 418 పరుగులు మాత్రమే. 400 పైచిలుకు పరుగుల టార్గెట్ ను ఛేదించడం చాలా అరుదు కూడా. అందుకే ఇప్పుడు పరిస్థితులు ఆసీస్ కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా తొలి రోజు 280 పరుగులు చేయడమే తక్కువ. అలాంటిది చివరి రోజు, నాలుగు రోజులు ఆడిన పిచ్ పై అన్ని పరుగులు సాధించాలంటే అద్భుతమే జరగాలి.

కాకపోతే ఏడాది కిందట ఆసీస్ కు కంచుకోట లాంటి గబ్బా స్టేడియంలో చివరి రోజు 325 పరుగులు లక్ష్యాన్ని ఛేదించిన చరిత్ర టీమిండియాకు ఉంది. అప్పుడు విరాట్ కోహ్లీ కూడా లేడు. ఇప్పుడు ఓవల్ గ్రౌండ్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగానే ఉంది. నాడు కెప్టెన్ గా ఉన్న అజింక్య రహానే నేడు క్రీజులో నిలబడితే.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ కలబడితే.. కొండంత లక్ష్యమైనా కరిగిపోవాల్సిందే. రవిశాస్త్రి నమ్మకం కూడా అదే. చూద్దాం.. ఏం చేస్తారో!?

More Telugu News