Venkaiah Naidu: జైలుకు వెళ్లడం నా జీవితాన్నే మార్చేసింది: వెంకయ్యనాయుడు

  • అవినీతి నిర్మూలనలో యువత కీలకపాత్ర పోషించాలన్న వెంకయ్య
  • పాశ్చాత్య దేశాల ఆహారాలకు అలవాటు పడొద్దని సూచన
  • లాయర్ అవ్వాలనుకుని రాజకీయ నాయకుడినయ్యానని వెల్లడి
Going to jail changed my life says Venkaiah Naidu

మన దేశంలో అవినీతి భారీగా పెరిగిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి నిర్మూలనలో యువత కీలకపాత్ర పోషించాలని అన్నారు. అందరూ నీతివంతంగా ఉన్నప్పుడే అవినీతి అంతమవుతుందని, సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీలో జరిగిన శ్రీధర్స్ సీసీఈ విజయోత్సవ సభకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

అందరూ మన దేశ ఆహార అలవాట్లకు ప్రాధాన్యతను ఇవ్వాలని వెంకయ్య సూచించారు. పాశ్చాత్య దేశాల ఆహారాలకు అలవాటు పడటం మన ఆరోగ్యాలకు మంచిది కాదని చెప్పారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తుందని తెలిపారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత వ్యాయామానికి, పుస్తకాలు చదవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నానని చెప్పారు. 

తాను లాయర్ అవ్వాలనుకున్నానని, కానీ రాజకీయ నాయకుడిని అయ్యానని వెంకయ్య తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో తాను జైలుకు వెళ్లానని... అదే తన జీవితాన్ని మార్చేసిందని చెప్పారు. మాతృభాషను, మాతృభూమిని మర్చిపోయేవాడు మనిషే కాదని అన్నారు. ప్రతి వ్యక్తి మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంచుకోవాని సూచించారు.

More Telugu News