Ravichandran Ashwin: టీమిండియా నిర్ణయాన్ని తప్పుబట్టిన ఆసీస్ దిగ్గజాలు

Aussies former cricketers questions Ravichandran Ashwin exclusion
  • టీమిండియా, ఆసీస్ జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్
  • టీమిండియాలో అశ్విన్ కు దక్కని స్థానం
  • ఆశ్చర్యపోయిన హేడెన్, పాంటింగ్
  • అశ్విన్ ను తీసుకోకపోవడం ఓ తప్పిదమని వెల్లడి
వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. అయితే, స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు టీమిండియా తుదిజట్టులో స్థానం లభించకపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మ్యాచ్ లో భారత్ రవీంద్ర జడేజా రూపంలో ఒక్క స్పిన్నర్ తోనే బరిలో దిగింది. 

ఈ నేపథ్యంలో, డబ్ల్యూటీసీ ఫైనల్ వంటి కీలక మ్యాచ్ కు అశ్విన్ తీసుకోకపోవడాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాలు మాథ్యూ హేడెన్, రికీ పాంటింగ్ తప్పుబట్టారు. హేడెన్ మాట్లాడుతూ, అశ్విన్ ను జట్టులోకి తీసుకుని ఉంటే ఎంతో కీలకంగా మారేవాడని అభిప్రాయపడ్డాడు. సీజన్ లో అత్యధిక వికెట్ల వీరుడు కీలక మ్యాచ్ లో లేకపోవడం విస్మయం కలిగిస్తోందని అన్నాడు. టీమిండియాలో కొన్ని అంశాలు విమర్శించదగ్గవిగా ఉన్నాయని హేడెన్ తెలిపాడు. 

రికీ పాంటింగ్ స్పందిస్తూ... అశ్విన్ ను తీసుకోకపోవడం ఓ తప్పిదం అని పేర్కొన్నాడు. టీమిండియా ఈ మ్యాచ్ లో నలుగురు పేసర్లతో బరిలో దిగడం సరైన నిర్ణయంలా అనిపించడంలేదని అన్నాడు. ఇలాంటి నిర్ణయాల నేపథ్యంలో ఈ టెస్టులో టీమిండియా పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి అని పాంటింగ్ వ్యాఖ్యానించాడు. 

మ్యాచ్ కొనసాగే కొద్దీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందనడంలో సందేహం లేదని, అదే సమయంలో ఆసీస్ జట్టులో చాలామంది ఎడమచేతివాటం ఆటగాళ్లు ఉన్నందున అశ్విన్ కచ్చితంగా కీలకంగా మారేవాడని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
Ravichandran Ashwin
Mathew Hayden
Ricky Ponting
WTC Final
Team India
Australia

More Telugu News