Fraud: ఒక వైన్ బాటిల్ కొంటే ప్రతి రోజూ డబ్బే డబ్బు అంటూ ఘరానా మోసం

  • ది వైన్ గ్రూప్ యాప్ ద్వారా టోకరా
  • కొన్నాళ్ల పాటు చెల్లింపులు చేసిన సంస్థ
  • ఆ తర్వాత దుకాణం బంద్
  • లబోదిబోమంటున్న బాధితులు
Fraudsters cheats people as lured them three times income with one bottle of wine

గుడ్డిగా నమ్మేవాళ్లు ఉన్నంతకాలం మోసగాళ్ల ఆటలు సాగుతూనే ఉంటాయి. మంచిర్యాల జిల్లాలోనూ చాలామంది అలాంటి ఘరానా మోసగాళ్ల బారినపడిన ఘటన వెలుగులోకొచ్చింది. ఒక వైన్ బాటిల్ కొంటే 60 రోజుల్లో మూడు రెట్లు అధికంగా చెల్లిస్తామంటూ మోసగాళ్లు విసిరిన మల్టీ లెవల్ మార్కెటింగ్ వలలో అనేకమంది చిక్కుకున్నారు. మంచిర్యాల జిల్లాలో కొందరు లక్షల రూపాయలు నష్టపోయి ఇప్పుడు లబోదిబోమంటున్నారు. 

ఒక వైన్ బాటిల్ ను రూ.85 వేలకు కొంటే... రోజుకు రూ.12,300 చెల్లిస్తామని ప్రలోభపెట్టారు. కొత్తగా 230 మందిని చేర్చితే నెలకు రూ.20 వేల జీతం అని కూడా ప్రకటించారు. ఇవన్నీ నమ్మిన ప్రజలు వైన్ బాటిళ్లు కొనడమే కాదు పెద్ద సంఖ్యలో ఇతరులను చేర్పించారు. వైన్ బాటిల్ కొన్నవాళ్లకు కేటుగాళ్లు కొన్నిరోజుల పాటు చెల్లింపులు చేశారు. ఇది చూసి చాలామంది వైన్ బాటిళ్లు కొని బొక్కబోర్లాపడ్డారు. ఈ తంతును మోసగాళ్లు ఓ యాప్ (ది వైన్ గ్రూప్) ద్వారా నిర్వహించారు. 

ఓ వ్యక్తి రూ.1.50 లక్షలు కట్టగా, అతడికి తిరిగి లభించింది రూ.30 వేలే. రూ.1.20 లక్షలు నష్టపోయిన ఆ వ్యక్తి మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు. గ్రూప్ మేనేజర్, ఇతర సిబ్బందిని విషయం కనుక్కుందామని సందేశాలు పంపితే ఎవరూ స్పందించడంలేదని ఆ బాధితుడు వాపోయాడు. 

ఇలాంటి వాళ్లు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది ది వైన్ గ్రూప్ లో డబ్బులు చెల్లించినట్టు తెలుస్తోంది. ఒక్క మంచిర్యాల జిల్లాలోనే బాధితులు వందల్లో ఉన్నారు. కాగా, గత నెలాఖరు నుంచి డబ్బులు రాకపోవడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది.

More Telugu News