Patancheru: పక్కింటి వాళ్లు తిట్టారని హైదరాబాద్ లో గృహిణి ఆత్మహత్య

25 year old Married Woman died by suicide Suspiciously in Patancheru
  • భర్తకు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదనతో బలవన్మరణం
  • పఠాన్ చెరులో ఘటన.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు
  • నిందితులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రుల డిమాండ్
పిల్లల ఆటల్లో మొదలైన గొడవ పెద్దవాళ్ల వరకూ వెళ్లింది.. దీనిపై పొరుగింట్లో ఉండే వారితో గొడవపడిందో గృహిణి. వాళ్లు నోటికి వచ్చినట్లు తిట్టడంతో అవమానంగా ఫీలయింది. భర్త ఇంటికి వచ్చాక చెప్పుకుని బాధపడింది. వారిని నిలదీయాలని అడిగినా భర్త పట్టించుకోలేదని మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ లోని పటాన్ చెరులో ఈ విషాదం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన గణేశ్, శిరీష (25) నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఆదివారం సాయంత్రం శిరీష కూతురు పల్లవి పక్కింటి పిల్లలతో ఆడుకుంది. ఆటల్లో గొడవ జరగడంతో ఇంట్లోకి వెళ్లి తల్లితో చెప్పింది. దీంతో శిరీష పక్కింటి పిల్లలను మందలించగా.. ఆ పిల్లల తల్లిదండ్రులు గొడవకు వచ్చారు. ఇద్దరూ నోటికి వచ్చినట్లు తిట్టడంతో శిరీష అవమానంగా భావించింది. ఈ విషయం భర్తకు ఫోన్‌ చేసి చెప్పింది.

రాత్రి ఇంటికి వచ్చిన గణేశ్ ను పక్కింటి వారిని నిలదీయాలని అడిగింది. అయితే, గొడవను ఇంకా పెద్దది చేయడం ఎందుకనే ఉద్దేశంతో గణేశ్ ఈ విషయాన్ని దాటవేశాడు. భర్త తీరుతో మరింత అవమానంగా ఫీలయిన శిరీష.. అదే రాత్రి గదిలో ఉరేసుకుని చనిపోయింది. కూతురు మరణవార్త విని అల్లుడి ఇంటికి వచ్చిన శిరీష తల్లిదండ్రులు.. శిరీష మృతిపై సందేహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురు మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
Patancheru
House wife suicide
Hyderabad
Crime News
Telangana

More Telugu News