Karnataka: ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం సీట్లు మగవారికి మాత్రమే.. ఎక్కడంటే!

50 Percent Seat Reservation for Men in Karnataka RTC Buses
  • కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ నిర్ణయం
  • మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో మగవారికి సీట్లు
  • ఏసీ, లగ్జరీ బస్సుల్లో మాత్రం ఉచిత ప్రయాణం కుదరదు
స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం.. అంటూ ఆర్టీసీ బస్సుల్లో పెద్ద పెద్ద అక్షరాలతో కనిపించే స్టిక్కర్లు చూసే ఉంటారు. ఇకపై వాటి పక్కనే పురుషులకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం అనే స్టిక్కర్లు కనిపించబోతున్నాయి. కాకపోతే వాటిని చదవాలంటే కన్నడ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటారా.. ఆ నినాదాలు కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లోనే కనిపించే అవకాశం ఉంది కాబట్టి. అవును, ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు సీట్లు రిజర్వ్ చేసినట్లే ఇకపై పురుషులకూ 50 శాతం సీట్లు రిజర్వ్ చేయనున్నట్లు కర్ణాటక ఆర్టీసీ ప్రకటించింది.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలు నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 11 నుంచి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏసీ, లగ్జరీ బస్సులను మాత్రం దీని నుంచి మినహాయించింది. కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.

ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే, డబ్బులు పెట్టి ప్రయాణించే పురుషులు నిల్చుని ప్రయాణించడం భావ్యం కాదని భావించిందో ఏమో కానీ సీట్లలో 50 శాతం పురుషులకు రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. ఈ సీట్ల వెనుక పురుషులకు మాత్రమే అంటూ స్టిక్కర్లు అంటించనున్నట్లు అధికారులు తెలిపారు. బస్సులో పురుషులు లేకుంటే స్త్రీలు ఈ సీట్లలో కూర్చోవచ్చు, పురుషులు రాగానే లేచి సీటివ్వాల్సి ఉంటుందని చెప్పారు.
Karnataka
RTC Buses
seats only for men
50% seats
Congress
Siddaramaiah

More Telugu News