Monsoon: నైరుతి రాక ఆలస్యం: భారత వాతావరణ శాఖ

  • జూన్ 7 నాటికి కేరళను చేరే అవకాశం
  • 3-4 రోజుల పాటు ఆలస్యం కావచ్చని తాజా అంచనా
  • సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రకటన
Monsoon delayed in Kerala likely to arrive by June 7 IMD

వర్షాల దోబూచులాట మొదలైంది. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కానుంది. నైరుతి రుతుపవనాలు మూడు నుంచి నాలుగు రోజులు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకవచ్చని భారత వాతావరణ శాఖ సోమవారం ప్రకటన విడుదల చేసింది. నిజానికి కేరళ తీరాన్ని జూన్ 4 నాటికి రుతు పవనాలు చేరుకుంటాయని తొలుత అంచనా వేశారు. తాజా అంచనాల ప్రకారం జూన్ 7 నాటికి రుతు పవనాలు కేరళను చేరుకోనున్నాయి. ఆ తర్వాత అక్కడి నుంచి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు రుతు పవనాల వ్యాప్తి కొనసాగుతుంటుంది.

‘‘దక్షిణ అరేబియా సముద్రంపై పశ్చిమాది గాలులు పెరుగుతుండడంతో, పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. పడమర గాలుల తీవ్రత నిన్నటి నుంచి పెరిగింది. సముద్ర ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తుకు జూన్ 4న చేరాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంపైనా మేఘాల వ్యాప్తి పెరుగుతోంది. ఈ అనుకూల పరిస్థితులతో రుతుపవనాలు వచ్చే మూడు నాలుగు రోజుల్లో మరింత పురోగమిస్తాయి’’ అని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. 

ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉంటున్నప్పటికీ, సాధారణ వర్షాలకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ లోగడ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. 2022లో నైరుతి రుతు పవనాలు మే 29 కేరళ తీరాన్ని చేరగా, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న చేరుకున్నాయి. ఈ ప్రకారం ఈ ఏడాది ఇప్పటికే ఆలస్యమైనట్టు తెలుస్తోంది.

More Telugu News