Train Accident: 4 ట్రాక్‌లు, 3 రైళ్లు.. నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది!

  • ఒడిశా రైలు ప్రమాదం ఘటనలో 280 మందికి పైగా మృత్యువాత
  • ఒకదానిని మరొకటి బలంగా ఢీకొనడంతో ఊహించని ప్రమాదం
  • ఢీకొన్న సమయంలో అతివేగంతో వెళ్తున్న రైళ్లు
4 Tracks 3 Trains Disaster In Mere Minutes

ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం సాయంత్రం మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో 280 మందికి పైగా ప్రయాణీకులు మృతి చెందగా, 900 మంది వరకు గాయపడ్డారు. కోరమండల్ షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి, గూడ్స్ రైలును ఢీకొట్టింది. అదే సమయంలో మరో ట్రాక్ పై నుండి వస్తున్న యశ్వంత్ పూర్ - హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు కోరమండల్ రైలు పైకి దూసుకెళ్లింది. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. నాలుగు ట్రాక్ లు ఉండగా మూడు ట్రాక్ లలో రైళ్లు ఉన్నాయి. నిమిషాల్లోనే పెను ప్రమాదం జరిగింది.

రెండు పాసింజర్ రైళ్లలో ఒకదానిని మరొకటి బలంగా ఢీకొందని, నిలిపి ఉన్న గూడ్స్ ను కూడా మొదటి రైలు ఢీకొట్టిందని ఇండియన్ రైల్వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ శర్మ అన్నారు.

 రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. తొలుత చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు నిలిచి ఉన్న గూడ్స్ ను ఢీకొట్టింది. దీంతో చాలా కోచ్ లు బోల్తా పడ్డాయి. ఆ తర్వాత యశ్వంత్ పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన కోచ్ లను ఢీకొట్టింది. ఢీకొన్న సమయంలో రెండు రైళ్లు కూడా అతివేగంతో ఉన్నాయి. 

అధికారులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం గం.6.50 నుండి గం.7.10 మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. భారీ ప్రమాదం నేపథ్యంలో రాత్రంతా సహాయక చర్యలు కొనసాగాయి.

More Telugu News