Pawan Kalyan: ఈ నెల 14 నుంచి పవన్ వారాహి యాత్ర: నాదెండ్ల మనోహర్

  • పవన్ వారాహి యాత్రకు ముహూర్తం ఖరారు
  • మీడియాకు వివరాలు తెలిపిన నాదెండ్ల
  • అన్నవరం క్షేత్రంలో పూజల అనంతరం పవన్ యాత్ర ప్రారంభం
  • తొలి విడతగా తూర్పు గోదావరి జిల్లాలోని నియోజకవర్గాల్లో పవన్ యాత్ర
Nadendla Manohar said Pawan Varahi Yatra will commence from June 14

జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఖరారైంది. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. పీఏసీ సభ్యులతో నాదెండ్ల మనోహర్ సమావేశమై పవన్ పర్యటనపై చర్చించారు. 

ఈ సమావేశం ముగిసిన అనంతరం నాదెండ్ల మీడియా సమావేశం నిర్వహించారు. వారాహి వాహనం ద్వారా యాత్ర చేపడుతున్నామని వెల్లడించారు. ఈ నెల 14 నుంచి పవన్ వారాహి వాహనం రోడ్డెక్కుతుందని తెలిపారు. జనసేన యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ఖరారైందని తెలిపారు. తొలి విడతగా తూర్పు గోదావరి జిల్లాలోని నియోజకవర్గాల్లో పవన్ వారాహి యాత్ర ఉంటుందని చెప్పారు. అన్నవరం క్షేత్రంలో ప్రత్యేక పూజల అనంతరం వారాహి యాత్ర ప్రారంభమవుతుందని వివరించారు. 

ప్రారంభ యాత్ర అన్నవరం నుంచి భీమవరం వరకు సాగుతుందని... ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం, నరసాపురం నియోజకవర్గాల్లో పవన్ తొలివిడత యాత్ర సాగుతుందని నాదెండ్ల వెల్లడించారు.

యాత్రలో భాగంగా వివిధ వర్గాలతో కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని ముందుకు పోతామని వెల్లడించారు. జనసేన ద్వారా ప్రజలకు భరోసా కల్పించేలా యాత్ర ఉంటుందని నాదెండ్ల వివరించారు. జనసేన యాత్రతో క్షేత్రస్థాయిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. 

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన పాటుపడుతుందని, రైతులు, మహిళలకు బాసటగా నిలవడానికి పవన్ ప్రయత్నిస్తారని వెల్లడించారు.

More Telugu News