Karnam Malleswari: ఒలింపిక్ పతక విజేతలను అలా ఈడ్చుకెళ్తారా?: కరణం మల్లీశ్వరి ఆవేదన

Karanam Malleswari About Wrestlers Agitation
  • క్రీడాకారులతో ఇంత అమర్యాదగా ప్రవర్తించడం ఇదే మొదటిసారన్న మల్లీశ్వరి
  • వారిని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు చూసి తన మనసు తట్టుకోలేకపోయిందని ఆవేదన
  • వారు కోరితే క్రీడా మంత్రిత్వశాఖతో మాట్లాడతానని హామీ

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన రెజ్లర్లను పోలీసులు ఈడ్చి పడేయడంపై మాజీ వెయిట్ లిఫ్టర్, ఒలింపిక్ పతక విజేత కరణం మల్లీశ్వరి తీవ్రంగా స్పందించారు. క్రీడాకారులపై ఇంత అమానవీయంగా ప్రవర్తించడాన్ని తాను మరెక్కడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలపై భారత కీర్తిపతాకను ఎగరవేసిన క్రీడాకారులను నడిరోడ్డుపై అలా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు చూసి తన మనసు తట్టుకోలేకపోయిందని ఓ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

అంతర్జాతీయ చాంపియన్ల పట్ల ఇంత అమానవీయంగా ప్రవర్తించడం ఇదే మొదటిసారని అన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న రెజ్లర్లకు తన పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. చట్టం ప్రకారం దోషులను శిక్షించాల్సిందేనని, వారు కోరితే బాధితుల తరపున క్రీడా మంత్రిత్వశాఖతో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఆందోళన చేస్తున్న వారిలో వినేశ్ ఫొగట్ సోదరి హర్యానాలో బీజేపీ నాయకురాలిగా ఉన్నారని, కాబట్టి దీనిని రాజకీయ సమస్యగా చూడకూడదని మల్లీశ్వరి పేర్కొన్నారు. రెజ్లర్లతో పీటీ ఉష వ్యవహరించిన తీరుపైనా ఆమె మండిపడ్డారు.

  • Loading...

More Telugu News