Somireddy Chandra Mohan Reddy: పాపాలు పండే రోజు వచ్చింది.. జనంలో తిరుగుబాటు మొదలైంది: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

  • జగన్ ఎప్పుడు ఎన్నికలకు పోయినా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న సోమిరెడ్డి 
  • వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలతో జగన్‌కు నిద్రపట్టడం లేదని వ్యాఖ్య 
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి ప్రభంజనం సృష్టించబోతున్నాయని వెల్లడి
tdp leader somireddy chandramohan reddy fires on jagan

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఏపీ సీఎం జగన్‌కు నిద్రపట్టడం లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మంచి మనసుతో, మంచి ఉద్దేశంతో పవన్‌ కల్యాణ్ పిలుపునిచ్చారని చెప్పారు. టీడీపీ, జనసేన కలిసి ప్రభంజనం సృష్టించబోతున్నాయని అన్నారు. రాజమండ్రిలో జరుగుతున్న మహానాడులో ఆయన ప్రసంగిస్తూ జగన్ పై విమర్శలు గుప్పించారు. 

 ‘‘ఈ నాలుగేళ్లలో రాష్ట్రం అల్లకల్లోలమైంది. అప్రతిష్టపాలైంది. అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారింది. దీంతో జనంలో తిరుగుబాటు మొదలైంది’’ అన్నారాయన. ఏపీని హింసావాది చేతుల్లో నుంచి కాపాడుకోవాలని ప్రజలు భావిస్తున్నారని సోమిరెడ్డి తెలిపారు. వైఎస్ వివేకా హత్య కేసు సీఎం జగన్ చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐకి ఏం అడ్డం వచ్చిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థ అవినాశ్ రెడ్డి చుట్టూ తిరుగుతోందని అన్నారు.

‘‘మాజీ మంత్రి వివేకానందరెడ్డిని కిరాతకంగా చంపి.. దాన్ని నారాసురుడని చంద్రబాబుపైకి నెట్టేసే ప్రయత్నం చేశారు. దేనికైనా పాపాలు పండే రోజు రావాలి. ఇప్పుడు వచ్చింది. సీబీఐ అన్ని విషయాలను బయటపెట్టింది’’ అని అన్నారు. ‘‘కిరాతకాలు మీరు చేసి మా మీద వేయాలని చూశారు. గతంలో కోడికత్తి వ్యవహారం మీరు చేసి చంద్రబాబుపై నెట్టాలని చూశారు’’ అని ఆరోపించారు. జగన్ ముందుగానో, లేటుగానో.. ఎప్పుడు ఎన్నికలకు పోయినా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సోమిరెడ్డి చెప్పారు.

More Telugu News