USA: అమెరికా వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్‌తో దూసుకెళ్లిన తెలుగు యువకుడికి శిక్ష ఇదేనా?

Saivarshith who threatened joe biden likely to be jailed for a maximum of 10 years along with a fine of rs 2 crores
  • భారీ ట్రక్‌తో వైట్‌హౌస్ పరిసరాల్లోకి దూసుకెళ్లిన తెలుగు సంతతి యువకుడు సాయివర్షిత్
  • బైడెన్‌ను చంపేందుకే వచ్చానని పోలీసులకు చెప్పిన నిందితుడు 
  • పలు సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు
  • సాయివర్షిత్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు, 
  • ఈ కేసులో గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా విధించొచ్చన్న జడ్జి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను చంపుతానంటూ వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్‌తో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టిన తెలుగు సంతతి యువకుడు సాయివర్షిత్‌కు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బుధవారం ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి రాబిన్ మెరివెదర్ సాయివర్షిత్‌కు మే 30 దాకా కస్టడీ విధించారు. 

సాయివర్షిత్ మిసోరీ రాష్ట్రంలో నివసిస్తుంటాడు. అతడు గతంలో డేటా అనలిస్ట్‌గా పనిచేశాడు. సోమవారం రాత్రి అతడు ఓ భారీ ట్రక్‌ నడుపుతూ శ్వేత సౌధం పరిసరాల్లోకి దూసుకొచ్చాడు. వైట్‌హౌస్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నంలో అక్కడున్న బారికేడ్లను ఢీకొట్టాడు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. 

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులకు అతడి ట్రక్‌లో జర్మనీ నియంత హిట్లర్‌కు చెందిన నాజీ పార్టీ జెండా కూడా కనిపించింది. బైడన్‌ను చంపి అమెరికా పగ్గాలు చేపట్టడమే తన లక్ష్యమని సాయివర్షిత్ పోలీసులకు చెప్పాడు. తానో డేటా అనలిస్ట్‌ అని చెప్పిన సాయివర్షిత్ ప్రస్తుతం తాను నిరుద్యోగినని చెప్పాడు. పోలీసులు నిందితుడిపై ఆస్తుల విధ్వంసం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, అధ్యక్షుడిని చంపుతానని బెదిరించడం, అనుమతి లేకుండా వైట్‌హౌస్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేయడం తదితర అభియోగాలను మోపారు. 

బుధవారం నారింజ రంగు జైలు దుస్తుల్లో కోర్టుకు హాజరైన సాయివర్షిత్, న్యాయమూర్తి అడిగిన సమాధానాలకు వినయంగా క్లుప్తంగా సమాధానాలు ఇచ్చాడు. అయితే, ఈ కేసులో గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటూ రూ.2 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయమూర్తి సాయివర్షిత్‌కు వివరించారు.
USA
Joe Biden

More Telugu News