Narendra Modi: పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి హాజరయ్యే పార్టీలు ఇవే!

15 parties mostly from BJP led NDA alliance to attend new Parliament building inauguration
  • కార్యక్రమానికి హాజరుకానున్న పార్టీల్లో అధికశాతం బీజేపీ మిత్రపక్షాలు
  • ఈ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు బుధవారం 19 ప్రతిపక్ష పార్టీల ప్రకటన
  • ప్రతిపక్షాల చర్యను ఖండించిన బీజేపీ
  • పార్లమెంటరీ సంప్రదాయాలపై వారికి గౌరవం లేదని వ్యాఖ్య
మే 28న జరగనున్న పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి మొత్తం 15 పార్టీలు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. వీటిలో అధికశాతం బీజేపీ మిత్రపక్షాలేనని సమాచారం. పార్లమెంట్ భవనాన్ని మోదీ స్వయంగా ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి బీజేపీ, శివసేన(ఏక్‌నాథ్ షిండే వర్గం), నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ, సిక్కిం కాంత్రికారీ మోర్చా, రాష్ట్రీయ లోక్ జనశక్తి, అప్నా దళ్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, తమిళ్ మానిల కాంగ్రెస్, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, మీజో నేషనల్ ఫ్రంట్, వైసీపీ, టీడీపీ, శిరోమణి అకాలీదళ్, బీజూ జనతాదళ్ పార్టీల వారు హాజరవుతారు. 

కాగా, పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు 19 ప్రతిపక్ష పార్టీలు బుధవారం ఓ ఉమ్మడి ప్రకటన జారీ చేశాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బదులు ప్రధాని మోదీ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్నందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి. ఈ చర్యను బీజేపీ ఖండించింది. పార్లమెంటరీ సంప్రదాయాలపై ప్రతిపక్షాలకు గౌరవం లేదని, గత తొమ్మిదేళ్లుగా వారి చర్యలు ఇదే సూచిస్తోందని వ్యాఖ్యానించింది.
Narendra Modi
New Delhi

More Telugu News