UK: బ్రిటన్‌లోని భారతీయ విద్యార్థులకు మరో షాక్
- విదేశీ విద్యార్థులు తమ కుటుంబసభ్యులను బ్రిటన్‌కు తీసుకురావడంపై కొత్త ఆంక్షలు
- తమపై ఆధారపడ్డవారిని బ్రిటన్‌కు తీసుకొచ్చేందుకు పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ కోర్సుల స్టూడెంట్స్‌కే అనుమతి
- తాజాగా నిబంధనలను ప్రకటించిన బ్రిటన్ హోం సెక్రెటరీ
- కొత్త నిబంధనలతో భారతీయులు సహా విదేశీ విద్యార్థులందరికీ షాక్
వలసల కట్టడికి ప్రయత్నిస్తున్న బ్రిటన్ ప్రభుత్వం విదేశీ విద్యార్థులకు మరో షాకిచ్చింది. బ్రిటన్‌లో పరిశోధన స్థాయి కోర్సులు చేస్తున్న విదేశీ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు మాత్రమే తమపై ఆధారపడ్డ కుటుంబసభ్యులు, ఇతరులను బ్రిటన్‌కు తీసుకొచ్చేందుకు అనుమతించింది. ఈ మేరకు బ్రిటన్ హోం సెక్రెటరీ సుయెల్లా బ్రెవర్మన్ కొత్త నిబంధనలను ప్రతినిధుల సభ ముందుకు తెచ్చారు.
విదేశీ విద్యార్థులపై ఆధారపడ్డ వారి కోసం 2022లో 1,36,000 వీసాలు జారీ చేసినట్టు సుయెల్లా బ్రెవర్మెన్ ఈ సందర్భంగా తెలిపారు. 2019 నాటితో పోలిస్తే ఈ వీసాల సంఖ్య ఎనిమిది రెట్లు పెరిగిందని చెప్పారు. ఈ నేపథ్యంలో వలసల నిరోధానికి కట్టడి చర్యలు అవసరమని భారత సంతతికి చెందిన మంత్రి అభిప్రాయపడ్డారు. ‘‘రీసెర్చ్ పోగ్రామ్స్ చేస్తున్న పోస్ట్‌గ్రాడ్యుయేట్ విదేశీ విద్యార్థులు మినహా ఇతరులెవ్వరూ తమపై ఆధారపడ్డ కుటుంబసభ్యులు లేదా ఇతరులను బ్రిటన్‌లోకి తీసుకొచ్చే హక్కు లేదు’’ అని ఆమె విస్పష్ట ప్రకటన చేశారు.