CSK: పదోసారి ఫైనల్లోకి చెన్నై సూపర్ కింగ్స్... గుజరాత్ కు మరో చాన్స్

  • చెపాక్ స్టేడియంలో క్వాలిఫయర్-1
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసిన చెన్నై
  • లక్ష్యఛేదనలో 157 పరుగులకు గుజరాత్ ఆలౌట్
  • ఐదుగురు బౌలర్లతోనే అద్భుతం చేసిన కెప్టెన్ ధోనీ
CSK rams into IPL final for tenth time

మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సొంతగడ్డపై గుజరాత్ టైటాన్స్ తో జరిగిన క్వాలిఫయర్-1లో సీఎస్కే 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది. 

ఈ మ్యాచ్ లో తన బౌలర్లను ధోనీ ఉపయోగించుకున్న విధానం అద్భుతం. ఏ బౌలర్ కు ఎప్పుడు బంతినివ్వాలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ధోనీ అందుకు తగ్గ ఫలితాలు అందుకున్నాడు. కేవలం ఐదుగురు బౌలర్లతోనే గుజరాత్ టైటాన్స్ పనిబట్టాడు. సీఎస్కే బౌలర్లు దీపక్ చహర్ 2, మహీశ్ తీక్షణ 2, రవీంద్ర జడేజా 2, మతీష పతిరణ 2, తుషార్ దేశ్ పాండే 1 వికెట్ తీశారు. 

ఆఖర్లో రషీద్ ఖాన్ కాస్త భయపెట్టినా, దేశ్ పాండే విసిరిన ఓ ఆఫ్ సైడ్ ఫుల్ టాస్ తో అతడి కథ ముగిసింది. రషీద్ ఖాన్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 30 పరుగులు చేశాడు. అంతకుముందు, గుజరాత్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 42 పరుగులు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (8), డేవిడ్ మిల్లర్ (4), తెవాటియా (3) విఫలమయ్యారు. 

కాగా, ఈ టోర్నీలో గుజరాత్ టైటాన్స్ ను ఆలౌట్ చేసిన తొలి జట్టుగా సూపర్ కింగ్స్ నిలిచింది. ఇన్నింగ్స్ ఆఖరిబంతికి పతిరణ విసిరిన బంతిని భారీ షాట్ కొట్టబోయిన షమీ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దాంతో గుజరాత్ ఇన్నింగ్స్ కు తెరపడింది.

ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్లోకి ప్రవేశించడం ఇది పదోసారి. ఈ నెల 28న అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫయర్-2 మ్యాచ్ విజేతతో తలపడనుంది. నేటి మ్యాచ్ లో ఓడిన గుజరాత్ టైటాన్స్ కు మరో చాన్స్ ఉంది. ఆ జట్టు మే 26న జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్ లో ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో తలపడనుంది.

More Telugu News