Kotamreddy Sridhar Reddy: భవిష్యత్తులో గెరిల్లా ఆందోళనలు చేపడతాం: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

  • క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం చేశానన్న కోటంరెడ్డి
  • సీఎం మూడుసార్లు సంతకం చేసినా నిధులు మంజూరు కాలేదని విమర్శ
  • శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపాటు
We will take up guerilla type protests says Kotamreddy

క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం నాలుగేళ్లుగా అలుపెరుగని పోరాటం చేశానని నెల్లూరు రూరల్ వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కమ్యూనిటీ హాల్ కోసం ముఖ్యమంత్రి జగన్ ముచ్చటగా మూడుసార్లు సంతకాలు చేసినా నిధులు మాత్రం విడుదల కాలేదని విమర్శించారు. నెల రోజులుగా క్రైస్తవ సోదరులతో పోస్ట్ కార్డ్, మెసేజ్ పోస్టింగ్ ఉద్యమాన్ని చేపట్టినా ఫలితం దక్కలేదని చెప్పారు. గాంధీ మార్గంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 

పోలీసులను ఇంటి వద్దకు పంపి తనను ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడం దారుణమని కోటంరెడ్డి అన్నారు. మనం నియంతల పాలనలో ఉన్నామా? లేక ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే విషయం అర్థం కావడం లేదని చెప్పారు. కేసులు, అరెస్టులు, తుపాకులు, తూటాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని... భవిష్యత్తులో గెరిల్లా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. 

ప్రజా ఉద్యమాలను అడ్డుకునే ప్రభుత్వాలకు మంచి పేరు రాదని చెప్పారు. వైసీపీ పార్టీ వారు అడ్డగోలుగా రోడ్లపై మీటింగులు పెడితే రాని ఇబ్బందులు ప్రతిపక్షాలు శాంతియుతంగా కార్యక్రమాలు చేపడితే వస్తాయా? అని ప్రశ్నించారు. అణచివేతలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం కూడా ఇదే మాదిరి అణచివేత ధోరణిని ప్రదర్శించి ఉంటే... వైసీపీ నేతలు ఉద్యమాలు చేయగలిగేవారా? అని ప్రశ్నించారు.

More Telugu News