Siddaramaiah: కర్ణాటక సంక్షోభానికి ముగింపు!

Deadlock over as Congress picks Siddaramaiah as new Karnataka CM DK Shivakumar his deputy
  • ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యకే ఓటు
  • డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్
  • ఈ నెల 20న ప్రమాణ స్వీకారం
  • నేటి సాయంత్రం సీఎల్పీ భేటీ
నాలుగు రోజులుగా, ఎడతెగకుండా కొనసాగుతున్న కర్ణాటక రాష్ట్ర కొత్త సీఎం అంశానికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఓ ముగింపు ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పీఠానికి సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తీవ్రంగా పోటీ పడడం తెలిసిందే. సిద్ధరామయ్య వైపు అదిష్ఠానం మొగ్గు చూపగా, ఈ ప్రతిపాదనకు డీకే శివకుమార్ సానుకూలంగా లేరు. పార్టీకి 135 సీట్లు తెచ్చిపెట్టడంలో ముఖ్య పాత్ర పోషించాను కనుక తనకే సీఎం పదవి ఇవ్వాలంటూ ఆయన భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో అధిష్ఠానానికి ఏం చేయాలో పాలుపోలేదు.

చర్చోపచర్చల తర్వాత సీఎం పదవికి సిద్ధరామయ్యనే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎంపిక చేసినట్టు విశ్వసనీయ సమాచారం. డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వనున్నారు. వీరు ఈ నెల 20 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి కానుంది. ఇద్దరు నేతలతో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ పలు విడతలుగా చర్చలు నిర్వహించారు. 

బెంగళూరులో గురువారం సాయంత్రం 7 గంటలకు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) భేటీ జరగనుంది. ఈ సమావేశంలోనే కేబినెట్, పోర్ట్ ఫోలియో లపై చర్చింనున్నట్టు తెలుస్తోంది. తనకు సీఎం పదవే కావాలంటూ మొండి పట్టుతో ఉన్న డీకే శివకుమార్ కు పార్టీ హైకమాండ్ రెండు ఆఫర్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రితోపాటు రాష్ట్రంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగొచ్చు. లేదంటే డిప్యూటీ సీఎంతోపాటు ఆరు మంత్రిత్వ శాఖలను ఆయన తన వర్గీయుల కోసం తీసుకోవచ్చు. అనూహ్య పరిణామాలు ఏవైనా చోటు చేసుకుంటే తప్ప ఈ ప్రతిపాదనలే కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Siddaramaiah
Karnataka
cm
DK Shivakumar
deputy cm
congress

More Telugu News