DK Shivakumar: డీకే శివకుమార్ కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట

  • నాలుగేళ్ల క్రితం నాటి అవినీతి నిరోధక చట్టం కేసు
  • ఫిబ్రవరి 10న సీబీఐ దర్యాఫ్తుపై స్టే విధించిన కర్ణాటక హైకోర్టు
  • కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు సీబీఐ
  • సీబీఐ పిటిషన్ పై విచారణను జులై 14కు వాయిదా వేసిన సుప్రీం 
SC grants interim stay on probe against DK Shivakumar in disproportionate assets case

ముఖ్యమంత్రి రేసులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ కు సుప్రీంకోర్టులో బుధవారం ఊరట లభించింది. ముఖ్యమంత్రిగా శివకుమార్, సిద్ధరామయ్యలలో ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై అధిష్ఠానం చర్చోపచర్చలు జరుపుతున్న సమయంలో డీకేకు ఊరట దక్కింది. ఆయనపై ఉన్న అక్రమాస్తులకు సంబంధించిన కేసులో డీకేకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఆయనపై దర్యాఫ్తుకు సంబంధించి మధ్యంతర స్టే ఇస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను జులై 14వ తేదీకి సుప్రీం వాయిదా వేసింది.

జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కారోల్ లతో కూడిన ధర్మాసనం ఈ రోజు దీనిపై విచారణ చేపట్టింది. డీకే శివకుమార్ తరఫున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. మే 23వ తేదీన ఇందుకు సంబంధించిన కేసు హైకోర్టు ముందుకు రానున్నట్లు చెప్పారు. దీంతో సీబీఐ వేసిన పిటిషన్‌ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శివకుమార్‌పై సీబీఐ ప్రొసీడింగ్స్ మీద ఫిబ్రవరి 10న కర్ణాటక హైకోర్టు స్టే విధించింది.

2017లో శివకుమార్ ఆస్తులపై ఐటీ దాడులు జరిగాయి. ఈ కేసుకు సంబంధించి ఈడీ దర్యాఫ్తును ప్రారంభించింది. ఈడీ దర్యాఫ్తు అనంతరం ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సీబీఐ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని కోరింది. సెప్టెంబర్ 25, 2019న అనుమతి లభించడంతో అక్టోబర్ 3, 2020న శివకుమార్‌పై సీబీఐ అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసు 2020 నాటిది అని, అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీబీఐ తనకు పదేపదే నోటీసులు జారీ చేయడం ద్వారా తనను మానసిక ఒత్తిడికి గురి చేస్తోందని డీకే శివకుమార్ ఎన్నికలకు కొన్ని నెలల ముందు హైకోర్టును ఆశ్రయించారు. ఫిబ్రవరి 10న స్టే ఇచ్చిన కోర్టు, ఆ తర్వాత పలుమార్లు పొడిగించింది. దీంతో సీబీఐ దీనిని సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.

More Telugu News