Smoking: విమానంలో బీడీ కాల్చి.. జైలుపాలైన వృద్ధుడు

Akasa Air Flyer Arrested At Bengaluru Airport For Smoking Beedi Mid Air
  • బెంగళూరు విమానాశ్రయంలో రాజస్థానీ వృద్ధుడి అరెస్ట్
  • విమాన ప్రయాణం మొదటిసారి కావడంతో రూల్స్ తెలియదని వెల్లడి
  • కనీసం వారం పాటు జైలు జీవితం తప్పదన్న అధికారులు
తొలిసారి విమానం ఎక్కిన ఓ వృద్ధుడు తెలియక బీడీ ముట్టించాడు. విమానంలోని లావెటరీకి వెళ్లి పొగ తాగాడు. ఈ చర్యతో తోటి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించాడంటూ విమానంలోని సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. విమానం ల్యాండయ్యాక ఆ వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. విమానంలో పొగ తాగకూడదనే విషయం తనకు తెలియదని వృద్ధుడు మొత్తుకున్నా.. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనంటూ జైలుకు పంపించారు. ఈ కేసులో అరెస్ట్ అయితే కనీసం వారం పాటు జైలులోనే ఉండాల్సి వస్తుందని పోలీసులు చెప్పారు. బెంగళూరు విమానాశ్రయంలో మంగళవారం సాయంత్రం జరిగిందీ సంఘటన.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ లోని పాలి జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ మంగళవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి బెంగళూరుకు ఆకాశ ఎయిర్ విమానంలో ప్రయాణించాడు. ప్రయాణం మధ్యలో లావెటరీకి వెళ్లిన కుమార్.. లోపల బీడీ కాల్చాడు. సెక్యూరిటీ అలారం ద్వారా ఈ విషయాన్ని గుర్తించిన విమాన సిబ్బంది పైలట్ కు, ఎయిర్ లైన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు కంప్లైంట్ చేయడంతో కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి బెంగళూరు సెంట్రల్ జైలుకు పంపించారు. అయితే, తాను విమానం ఎక్కడం ఇదే మొదటిసారి అని, విమానంలో పొగ తాగకూడదనే విషయం తనకు తెలియదని కుమార్ చెప్పాడు. తరచూ రైలులో ప్రయాణించే తను లావెటరీలో బీడీ కాలుస్తానని, అలాగే విమానంలోనూ కాల్చవచ్చని భావించానని వివరించాడు.
Smoking
Akasa Air
Bengaluru Airport
smoking in flight

More Telugu News