DK Shivakumar: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్య

  • ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక రాజకీయాలు
  • సీఎం సీటు కోసం డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య పోటీ
  • కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలకు ఢిల్లీ బయలుదేరిన డీకే శివకుమార్
  • హైకమాండ్ ఆదేశాలు పాటిస్తానని వ్యాఖ్య 
DK siva kumar leaves for delhi

కర్ణాటక సీఎం ఎంపికపై ఎగడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం పీఠం కోసం సీనియర్ నేతలు డీకే శివకుమార్, సిద్ధరామయ్య పోటీ పడుతున్నారు. ఈ విషయమై చర్చించేందుకు డీకే శివకుమార్ మంగళవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే, ప్రయాణానికి ముందు ఆయన మీడియాతో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన బాధ్యతను తాను నిర్వహించానని, ఇచ్చిన హామీలు నెరవేర్చానని ఆయన చెప్పుకొచ్చారు. హైకమాండ్ ఆదేశాలే శిరోధార్యమన్న శివకుమార్, తమ మధ్య ఐకమత్యం ఉందని చెప్పారు. 

‘‘నేను ఎవరి మధ్యా విభజన తీసుకురాదలుచుకోలేదు. మా బలం 135 మంది సభ్యులు. వారికి నేను నచ్చినా నచ్చకపోయినా నేను మాత్రం బాధ్యతాయుతంగానే ఉంటాను. వెన్నుపోట్లు, బ్లాక్‌మెయిల్‌కు దిగను’’ అని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం సీటు కోసం ప్రయత్నిస్తున్న మరో కీలక నేత సిద్ధరామయ్య సోమవారమే ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో, తదుపరి ఏం జరుగనుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, కర్ణాటక సీఎం ఎవరో మంగళవారమే తేలిపోతుందని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు.

More Telugu News