SRH: సన్ రైజర్స్... మొదట చేయాల్సింది చివర్లో చేశారు!

  • గుజరాత్ టైటాన్స్ తో అహ్మదాబాద్ లో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • తొలుత భారీగా పరుగులు సమర్పించుకున్న సన్ రైజర్స్
  • ఆఖర్లో వరుసబెట్టి వికెట్లు తీసిన వైనం
  • చివరి 6 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన గుజరాత్
  • ఆఖరి ఓవర్లో 3 వికెట్లు తీసిన భువనేశ్వర్
SRH bowlers halts GI runs juggernaut in slag overs

సాధారణంగా ఏ జట్టయినా కొత్త బంతితో ప్రత్యర్థి జట్టును కట్టడి చేయాలని చూస్తుంది. కొత్త బంతి వేగంగా కదులుతుంది కాబట్టి, తొలి పవర్ ప్లేలోనే వీలైనన్ని ఎక్కువ వికెట్లు తీయాలని భావిస్తారు. కానీ, ఇవాళ గుజరాత్ టైటాన్స్ తో పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ అందుకు పూర్తి విరుద్ధమైన ప్రదర్శన కనబర్చింది. 

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్... ఆరంభంలో కేవలం ఒక్క వికెట్ తీసింది. ఆపై భారీగా పరుగులు సమర్పించుకుంది. సెంచరీ హీరో శుభ్ మాన్ గిల్ (101), సాయి సుదర్శన్ (47) సన్ రైజర్స్ బౌలింగ్ లో వీరవిహారం చేశారు. అద్భుతంగా ఆడిన గిల్ 58 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. 14 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ జట్టు స్కోరు 1 వికెట్ కు 147 పరుగులు. 

అక్కడ్నించి సన్ రైజర్స్ బౌలర్లు రెచ్చిపోయారు. వరుసబెట్టి వికెట్లు తీస్తూ గుజరాత్ టైటాన్స్ కు కళ్లెం వేశారు. ఏ 220 పరుగులో కొడుతుందని భావించిన గుజరాత్ ను 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులకే కట్టడి చేశారు. సన్ రైజర్స్ బౌలర్ల ధాటికి గుజరాత్ చివరి 6 ఓవర్లలో 41 పరుగులు చేసి ఏకంగా 8 వికెట్లు చేజార్చుకుంది. 

చివరి ఓవర్లో నాలుగు వికెట్లు పతనం కాగా, అందులో మూడు భువనేశ్వర్ ఖాతాలో పడ్డాయి. మొత్తమ్మీద భువనేశ్వర్ కుమార్ ఈ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయడం విశేషం. మార్కో జాన్సెన్ 1, ఫజల్ హక్ ఫరూఖీ 1, నటరాజన్ 1 వికెట్ తీశారు. 

గుజరాత్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (8), డేవిడ్ మిల్లర్ (7), రాహుల్ తెవాటియా (3) నిరాశపరిచారు. ఆఖరి ఓవర్లో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ డకౌట్ అయ్యారు. 

మొన్నటి మ్యాచ్ లో 10 సిక్సులు కొట్టిన రషీద్ ఖాన్ ఈ మ్యాచ్ లో భారీ షాట్లు కొడతారని అందరూ భావించారు. కానీ, అతడు ఆడిన తొలి బంతికే వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి సైలెంట్ గా వెనుదిరిగాడు.

More Telugu News