Madhya Pradesh: ఎగ్జామ్స్‌లో ఫెయిల్.. కిడ్నాప్ కథ అల్లిన డిగ్రీ విద్యార్థిని!

  • మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఘటన
  • ఓ ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసినట్టు కట్టుకథ
  • నిజం చెప్పేసిన సీసీటీవీ ఫుటేజీలు
  • కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టిన పోలీసులు
Girl Kidnap story after failing in exams in Madhya Pradesh

డిగ్రీ పరీక్షల్లో ఫెయిలైన ఓ విద్యార్థిని కిడ్నాప్ కథ అల్లి పోలీసులను పరుగులు పెట్టించింది. చివరికి ఆమె చెబుతున్నదంతా కట్టుకథ అని తేల్చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. డిగ్రీ (బీఏ) ఫస్టియర్ చదువుతున్న తన కుమార్తె (17) కిడ్నాప్ అయిందని, పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత కాలేజీ నుంచి వస్తుండగా ఇండోర్‌లోని ఓ ఆలయం వద్ద ఆమెను కొందరు కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఓ కొత్త నంబరు నుంచి తండ్రికి ఫోన్ చేసిన విద్యార్థిని.. ఫాకల్టీ ఒకరు తనను ఆలయ సమీపంలో విడిచిపెట్టారని, ఆ తర్వాత తాను ఓ ఈ-రిక్షా ఎక్కినట్టు చెప్పింది. ఆ తర్వాత డ్రైవర్ ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ముక్కుకు ఓ గుడ్డను వాసన చూపించడంతో స్పృహ కోల్పోయినట్టు చెప్పింది. 

విద్యార్థిని తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ఆమె చెప్పినదంతా కట్టుకథేనని తేల్చేశారు. అదే సమయంలో ఉజ్జయినిలోని ఓ రెస్టారెంట్‌లో విద్యార్థిని ఒంటరిగా కూర్చున్న ఫొటోలు లభ్యమయ్యాయి. రెండింటినీ సరిపోల్చిన పోలీసులు ఆ ఇద్దరూ ఒకరేనని తేల్చారు. 

ఆ తర్వాత ఆమెను ఇండోర్ తీసుకొచ్చారు. అక్కడ ఆమె బ్యాగును తనిఖీ చేయగా, ఇండోర్-ఉజ్జయిని బస్ టికెట్‌తోపాటు రెస్టారెంట్ బిల్లు కూడా లభ్యమైంది. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో దాని నుంచి తల్లిదండ్రుల దృష్టి మరల్చేందుకే బాలిక ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్టు గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

More Telugu News